Published : 23/12/2020 04:56 IST

దేశంలో కొత్త అలజడి

బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా
జన్యు మార్పిడి చెందిన వైరస్‌ కావొచ్చని ఆందోళన

దిల్లీ: కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న భారత్‌కు ‘కొత్త కరోనా’ భయం పట్టుకుంది! బ్రిటన్‌ నుంచి తాజాగా మన దేశానికి చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. వారికి సోకింది జన్యు మార్పిడి చెందిన వైరస్సా.. లేదంటే పాతదేనా అనే సంగతి నిర్ధరించడానికి అయా రాష్ట్రాల నుంచి బాధితుల నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపుతున్నారు. సెప్టెంబరు నుంచే కొత్త రకం వైరస్‌ బ్రిటన్‌లో ప్రబలుతున్నందున ఇప్పటికే అక్కడి నుంచి వచ్చినవారి ద్వారా మన దేశానికి కొత్త వైరస్‌ చేరి ఉండొచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లండన్‌ నుంచి సోమవారం రాత్రి దిల్లీకి ఎయిరిండియా విమానంలో వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురు కొవిడ్‌ బాధితులుగా తేలారు. వాస్తవానికి వారిలో ఐదుగురే దిల్లీలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. మరొకరు అక్కడి నుంచి చెన్నైకి చేరుకున్నాక పరీక్ష చేయించుకోగా కరోనా బారిన పడినట్లు స్పష్టమైంది.  దేశ రాజధానిలో పాజిటివ్‌గా తేలినవారి నమూనాలను అధికారులు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రానికి (ఎన్‌సీడీసీ) పంపించారు. లండన్‌ నుంచి కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్న విమానంలో ఇద్దరు కరోనా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. పాజిటివ్‌గా తేలిన ఇద్దరికి సమీపంలో కూర్చున్న వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అహ్మదాబాద్‌లో ఐదుగురికి..
లండన్‌ నుంచి మంగళవారం ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఐదుగురు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలారు. వారిలో ఒకరు బ్రిటన్‌వాసి కావడం గమనార్హం. బాధితులను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు- బ్రిటన్‌ నుంచి మూడు విమానాల్లో 590 మంది ప్రయాణికులు మంగళవారం ముంబయికి చేరుకున్నారు. వారిలో 187 మంది ముంబయికి చెందినవారు కాగా.. 167 మంది మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు చెందినవారని, మిగిలినవారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ఏ ఒక్కరూ పాజిటివ్‌గా తేలలేదని చెప్పారు.

అమృత్‌సర్‌లో ప్రయాణికుల నిరసన
బ్రిటన్‌ నుంచి 250 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బందితో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమృత్‌సర్‌కు చేరుకున్న ఎయిరిండియా విమానంలో 8 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. వారిలో విమానయాన సిబ్బంది కూడా ఒకరు ఉన్నారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ అమృత్‌సర్‌ విమానాశ్రయంలో కొంతమంది ప్రయాణికులు నిరసన వ్యక్తంచేశారు. పరీక్షల కోసం లోపల ప్రయాణికులు వేచి ఉండగా.. వారి బంధువులు, మిత్రులు బయట ఆందోళనతో వేచి చూస్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల వద్ద కనిపించాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు భారత్‌, బ్రిటన్‌ మధ్య విమాన సర్వీసులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే- మంగళవారం అర్ధరాత్రి వరకూ బ్రిటన్‌ నుంచి ప్రయాణికులు రానుండటంతో పాజిటివ్‌గా తేలే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.

చెన్నై బాధితుడి నమూనాలు ఎన్‌ఐవీకి
ఈనాడు డిజిటల్‌, చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని గిండిలోని కింగ్స్‌ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు సోకిన వైరస్‌ కొత్తదో పాతదో తేల్చేందుకుగాను రక్త నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీకి పంపించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ తెలిపారు. గత పది రోజుల్లో బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి 1,088 మంది వచ్చారని వెల్లడించారు. వారందర్నీ గుర్తించి 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు.

కర్ణాటకలో తల్లీకూతుళ్లకు..
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: లండన్‌ నుంచి బెంగళూరుకు ఈ నెల 19న విమానంలో వచ్చిన 38 మంది ప్రయాణికులకు తాజాగా పరీక్షలు నిర్వహించగా ఇద్దరు పాజిటివ్‌గా తేలారు. వారిద్దరు తల్లీకూతుళ్లు. తల్లి వయసు 35 ఏళ్లు కాగా, పాప వయసు కేవలం ఆరేళ్లు. వారి రక్త నమూనాలను ఎన్‌ఐవీకి పంపించినట్లు అధికారులు తెలిపారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని