DAP ఎరువుపై భారీ రాయితీ

రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. డీఏపీ ఎరువుపై ప్రస్తుతం

Updated : 20 May 2021 10:05 IST

ఒక్కో బస్తాపై సబ్సిడీ రూ.500 నుంచి రూ.1200కి పెంపు

ఈనాడు, దిల్లీ: రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రూ.500 రాయితీని రూ.1,200కి పెంచింది. తద్వారా ఈ ఎరువుపై రైతుకు అదనంగా 140%మేర రాయితీ ప్రయోజనం లభించనుంది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు లభించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు పేర్కొంది. గతంలో ఎన్నడూ ఇంత భారీస్థాయిలో ఒకేసారి రాయితీని పెంచిన దాఖలా లేదంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బస్తా డీఏపీ ఎరువు రూ.1,200 ధరకే రైతుకు లభించనుంది. గత ఏడాది డీఏపీ బస్తా వాస్తవ ధర రూ.1,700 ఉండగా కేంద్రం రూ.500మేర సబ్సిడీ ఇచ్చింది. దాంతో కంపెనీలు రూ.1,200కే బస్తాను విక్రయిస్తూ వచ్చాయి. ఇటీవల అంతర్జాతీయంగా ఫాస్ఫరిక్‌ యాసిడ్‌, అమ్మోనియా ధరలు 60% నుంచి 70%మేర పెరిగాయి. దాంతో డీఏపీ బస్తా ధర రూ.2,400కి చేరింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బస్తాకు రూ.500 రాయితీనే కొనసాగించడంతో ఎరువుల సంస్థలు రూ.1,900కి విక్రయిస్తూ వస్తున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో రాయితీ రూ.500 నుంచి రూ.1200లకు పెరిగింది. రైతులకు రూ.1,200కే బస్తా డీఏపీ దక్కనుంది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల రాయితీల కోసం ఏటా రూ.80వేల కోట్లు వెచ్చిస్తోంది.. ఇప్పుడు డీఏపీపై సబ్సిడీ పెంచడంతో ప్రభుత్వంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడుతుందని పీఎంవో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని