Krishnapatnam: ఆనందయ్య మందు పంపిణీకి ఓకే!

ఆయుష్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అనందయ్య తయారుచేస్తున్న మందు పంపిణీకి

Updated : 24 May 2021 12:57 IST

నిపుణుల కమిటీ నివేదిక తరువాత తుది నిర్ణయం
వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: ఆయుష్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అనందయ్య తయారుచేస్తున్న మందు పంపిణీకి అభ్యంతరం లేదని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వంశపారంపర్యంగా ఆయన ఈ మందు తయారుచేసి ఇస్తున్నారని, వీటిలో ఉపయోగిస్తున్న పదార్థాలతో హాని లేనట్లు వెల్లడైందని చెప్పారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అయితే ఆయుర్వేద మందుగా దీన్ని గుర్తించడం లేదని, అలా చేయాలంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయతపై నిర్ధారణ, ఇతర అనుమతులు అవసరమవుతాయని ఆయన వివరించారు.  
ప్రజలకు అందించడంపై దృష్టి: గోవర్ధన్‌రెడ్డి
ఆనందయ్య మందును ప్రజలకు చేరువ చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దృష్టి పెట్టారని వైకాపా జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. దీన్ని వాడటం వల్ల ఇబ్బందులు లేవని తేలితే పంపిణీకి అడ్డంకులు తొలగినట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లావ్యాప్తంగా అవసరమైన వారందరికీ పంపిణీ చేసే బాధ్యత తనదని అన్నారు. ఆనందయ్య మందును ఆయుష్‌, ఐసీఎంఆర్‌, ప్రభుత్వం ఆమోదిస్తే తితిదే ఆధ్వర్యంలో తయారుచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తితిదే పాలకమండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని