Krishnapatnam: ఆనందయ్య మందుపై అధ్యయనంలో అవాంతరాలు!

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందుపై కేంద్ర ఆయుర్వేద వైజ్ఞానిక పరిశోధన మండలి (సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌- సీసీఆర్‌ఏఎస్‌) చేపట్టిన అధ్యయనానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి.

Updated : 26 May 2021 08:23 IST

ఈనాడు, తిరుపతి: ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందుపై కేంద్ర ఆయుర్వేద వైజ్ఞానిక పరిశోధన మండలి (సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌- సీసీఆర్‌ఏఎస్‌) చేపట్టిన అధ్యయనానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. మందును స్వీకరించిన వ్యక్తుల అభిప్రాయాలు, వైద్య నివేదికలు సేకరించాలనుకున్న సీసీఆర్‌ఏఎస్‌ ఆ బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థతో పాటు తిరుపతి ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాలకు అప్పగించింది. తొలిదశలో 500 మంది నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ద్వారా ఔషధం పనితీరుపై ఓ అంచనాకు రావాలని భావించారు. ఈ రెండు సంస్థల సిబ్బంది తమకు అందిన సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా రోగులు, వారి బంధువులకు సోమవారం నుంచి ఫోన్‌ చేయడం ప్రారంభించారు. ‘జాబితాలోని 92 మందికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. 42 మంది తాము అసలు మందు తీసుకోలేదని చెప్పారు. మరో 36 మంది ఒకే నంబరు ఇచ్చారు. ఔషధం తీసుకున్నట్లు చెబుతున్న వారిలోనూ అనేక మంది వైరస్‌ రాకుండా ముందుజాగ్రత్తగా వేసుకున్నామని తెలిపారు. మరికొందరు కొవిడ్‌ బారిన పడ్డ తర్వాతే తీసుకున్నామని  చెప్పినా.. సంతృప్తికరంగా వివరాలు వెల్లడించలేదు’అని అధికారులు పేర్కొంటున్నారు.దీంతో ప్రభుత్వానికి ఎలా నివేదించాలంటూ ఆయుర్వేద సంస్థల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరింతమంది ఫోన్‌ నంబర్లు పంపించాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులను కోరారు. ఆనందయ్య దగ్గర సుమారు 70 వేల మంది ఔషధం తీసుకున్నట్లు పోలీసులు, నిఘా వర్గాల అంచనా. తన వద్దకు వచ్చిన వారి నుంచి ఆయన ఎలాంటి వివరాలు సేకరించలేదు. మరింత మందిని ఆరా తీస్తేగానీ ఓ స్పష్టత రాదని వైద్య అధికారులు చెబుతున్నారు.
హైకోర్టు విచారణ రేపు
ఈనాడు, అమరావతి: ఆనందయ్య కొవిడ్‌కు ఇస్తున్న మందు పంపిణీపై దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను  హైకోర్టు రేపు (ఈ నెల 27న) విచారించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని