Black Fungus ఔషధంపై జీఎస్‌టీ మినహాయింపు

కరోనా టీకాలు, వైద్య సామగ్రిపై పన్నులను యథాతథంగా కొనసాగించాలని వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి నిర్ణయించింది. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న టీకాలపై 5 శాతం జీఎస్‌టీ; కరోనా ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై 12 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం ఉపయోగించే ఔషధ దిగుమతులపై

Updated : 29 May 2021 08:21 IST

టీకాలపై పన్నుల్లో మార్పుల్లేవు

దిల్లీ: కరోనా టీకాలు, వైద్య సామగ్రిపై పన్నులను యథాతథంగా కొనసాగించాలని వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి నిర్ణయించింది. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న టీకాలపై 5 శాతం జీఎస్‌టీ; కరోనా ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై 12 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం ఉపయోగించే ఔషధ దిగుమతులపై జీఎస్టీని మినహాయించాలని మండలి నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన జీఎస్‌టీ మండలి ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంది. టీకాలు, వైద్య సామగ్రిపై ఉన్న పన్నురేట్లపై మంత్రుల బృందం చర్చిస్తుందని, జూన్‌ 8లోగా నివేదిక సమర్పిస్తుందని మండలి సమావేశం అనంతరం సీతారామన్‌ పేర్కొన్నారు. ‘పన్ను రేట్లు తగ్గిస్తే ఆ ప్రయోజనాలు తయారీదార్లు లేదా మధ్య వ్యవస్థలకు వెళతాయి. వాటిని అవి వినియోగదార్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి మంత్రుల బృందం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. సామాన్యుడికి ప్రయోజనాలు అందేలా చేయడం మా బాధ్యత’ అని సీతారామన్‌ విలేకర్లతో పేర్కొన్నారు.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కరోనా సంబంధిత సామగ్రిపై ఐజీఎస్‌టీ మినహాయింపును ఆగస్టు 31 వరకు కొనసాగించాలని మండలి నిర్ణయించినట్లు సీతారామన్‌ పేర్కొన్నారు. మెడికల్‌ ఆక్సిజన్‌, వ్యాక్సిన్లకు ఇది వర్తిస్తుందన్నారు. చెల్లింపు పద్ధతిలో, ప్రభుత్వానికి, ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీలకు ఉచితంగా అందించేందుకు దిగుమతి చేసుకున్నా, పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

రూ.1.58 లక్షల కోట్ల రుణం
జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్రాలకు వాటిల్లిన ఆదాయ నష్టాలను పూడ్చేందుకు రూ.1.58 లక్షల కోట్లను రుణాలుగా తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాలకిస్తున్న అయిదేళ్ల జీఎస్‌టీ ఆదాయ నష్టాల పరిహార గడువును 2022 తర్వాతా పొడిగించే అంశాన్ని పరిశీలించేందుకు మండలి ప్రత్యేక సమావేశాన్ని త్వరలో నిర్వహించనుంది. ఆలస్యంగా జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేసే చిన్న పన్ను చెల్లింపుదార్లకు ఒక ఆమ్నెస్టీ పథకం ద్వారా మండలి ఊరట కలిగించింది. జులై 2017-ఏప్రిల్‌ 2021 మధ్య రిటర్నులను (జీఎస్‌టీఆర్‌-3బీ) దాఖలు చేయని వారికి ఆలస్య రుసుమును రూ.500కే  పరిమితం చేశారు. అయితే పన్ను బకాయిలు ఉన్నవారికి గరిష్ఠంగా రూ.1000 వసూలు చేస్తారు. ఆగస్టు 31 కల్లా వారు  రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇంకా  రూ.2 కోట్ల వరకు సగటు టర్నోవరున్న వారికి 2020-21 వార్షిక రిటర్నులు ఆప్షనల్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని