Updated : 08/06/2021 08:24 IST

PRC: వేతన హుషార్‌

అమల్లోకి రానున్న పీఆర్‌సీ
నేడు మంత్రిమండలి ఆమోదానికి ఆ వెంటనే ఉత్తర్వులు
పలు ఇతర అంశాలపైనా నిర్ణయాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛనర్ల వేతన సవరణ (పే రివిజన్‌) అంశాలు మంగళవారం మంత్రిమండలి ఆమోదానికి రానున్నాయి. శాసనసభలో గత మార్చి 22న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన పీఆర్‌సీ, ఫిట్‌మెంటు, ఇతర నిర్ణయాల అమలును ఎజెండాలో చేర్చారు. మంత్రిమండలి ఆమోద ముద్ర అనంతరం ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2020 ఏప్రిల్‌ నుంచి వర్తించే విధంగా 30 శాతం ఫిట్‌మెంట్‌, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు సైతం వర్తింపు, పదవీ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, గ్రాట్యుటీ రూ.16 లక్షలు, 70 ఏళ్లకు అదనపు పింఛన్‌, విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్‌ ఉద్యోగులకు కుటుంబ పింఛన్‌, ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య సేవల పథకం (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం) నూతన విధివిధానాల రూపకల్పనకు స్టీరింగు కమిటీ ఏర్పాటు, ప్రాథమిక పాఠశాలల్లో పది వేలకు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్‌ అసిస్టెంట్ల సమానస్థాయి) పోస్టుల మంజూరు, అంతర్‌ జిల్లాల బదిలీలు వంటి నిర్ణయాలను సీఎం ప్రకటించారు. కరోనా దృష్ట్యా వీటి అమలులో జాప్యం ఏర్పడింది. తాజాగా లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం పీఆర్‌సీకి మోక్షం కలిగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ పూర్తిస్థాయి నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది. మంత్రిమండలి ఆమోదం అనంతరం ఉత్తర్వులను జారీ చేయనుంది.

లాక్‌డౌన్‌ సడలింపుపై నిర్ణయం
సాయంత్రం ఆరు వరకు లాక్‌డౌన్‌ కాలం సడలింపు, పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, రాత్రిపూట పకడ్బందీగా కర్ఫ్యూ, కరోనా నియంత్రణ, నీటిపారుదల శాఖలో అదనపు ఆయకట్టు కోసం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, వాటి పురోగతి, పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోనుంది. 15 నుంచి రైతుబంధు సాయం పంపిణీ, వానాకాలం సీజన్‌కు ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సరఫరా, ఆయకట్టు పెరుగుదల, రాష్ట్రంలో కల్తీవిత్తనాల నిరోధం కోసం క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత విత్తన విధానం, బయో ఫెర్టిలైజర్స్‌కు ఆర్డినెన్స్‌లకు ఆమోదం, కొత్త ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇవ్వనుంది. రాష్ట్రంలో 19 జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను 9వ తేదీన ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రారంభించాలో నిర్ణయించనుంది.

హుజూరాబాద్‌కు సంబంధించి..
ఈటల రాజేందర్‌ రాజీనామా చేస్తే హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందనే భావనతో ఆ నియోజకవర్గానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను మంత్రిమండలి తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈటల రాజీనామా అనంతరం వీటిని వెల్లడించే వీలుంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని