Phone hack: కేంద్ర మంత్రులు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాక్‌?

దేశంలో మళ్లీ హ్యాకింగ్‌ కలకలం చెలరేగింది. పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడైంది! తాజాగా లీక్‌ అయిన ఓ డేటాబేస్‌లో వారందరి ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని

Updated : 19 Jul 2021 09:33 IST

బాధితుల జాబితాలో ప్రతిపక్ష నేతలు, సుప్రీం సిట్టింగ్‌ న్యాయమూర్తి కూడా..

‘పెగాసస్‌’తో 2018-19 మధ్య లక్ష్యంగా చేసుకున్నారు

‘ది వైర్‌’లో సంచలనాత్మక కథనం

దిల్లీ: దేశంలో మళ్లీ హ్యాకింగ్‌ కలకలం చెలరేగింది. పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడైంది! తాజాగా లీక్‌ అయిన ఓ డేటాబేస్‌లో వారందరి ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ కంపెనీకి చెందిన ‘పెగాసస్‌’ అనే స్పైవేర్‌ సాయంతో ఈ హ్యాకింగ్‌ తంతు సాగినట్లు తెలుస్తోందని ‘ది వైర్‌’ వార్తాసంస్థ ఓ కథనంలో వెల్లడించింది. వాస్తవానికి ఈ స్పైవేర్‌ ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉంటుంది. నిఘా కార్యకలాపాల కోసం దాన్ని ప్రభుత్వ సంస్థలకు ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ విక్రయిస్తుంటుంది. దీంతో తాజా హ్యాకింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే- ఇందులో తమ జోక్యం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దేశ పౌరులందరి గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. హ్యాకింగ్‌ ఆరోపణలను తోసుపుచ్చింది.  ‘ది వైర్‌’ కథనం ప్రకారం.. ‘పెగాసస్‌’తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారందరి ఫోన్‌ నంబర్లు తాజా డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తల వంటి వారు బాధితుల జాబితాలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. 2018-19 సంవత్సరాల మధ్య వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. సుప్రీం కోర్టుకు చెందిన ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తి ఫోన్‌ నంబరు కూడా జాబితాలో ఉంది. భారతదేశంతో పాటు అజర్‌బైజాన్‌, బహ్రెయిన్‌, హంగేరి, మెక్సికో, మొరాకో,    సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందిన ప్రముఖుల పేర్లు తాజా డేటాబేస్‌లో ఉన్నాయి. ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ సహా 16 విదేశీ వార్తాసంస్థలు కూడా ఈ హ్యాకింగ్‌ సంబంధిత కథనాలను ప్రచురించాయి.
ఫోరెన్సిక్‌ విశ్లేషణతో నిర్ధారణ
వాస్తవానికి లక్షిత ఫోన్‌ నంబర్లనే తాజా డేటాబేస్‌ చూపిస్తుంది. అందులో పేర్లు/నంబర్లు ఉన్నంత మాత్రాన వారి ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు కాదు. భవిష్యత్తులో లక్ష్యంగా చేసుకునేందుకు ఉద్దేశించిన నంబర్లూ అందులో ఉంటాయి. దీంతో ఇప్పటివరకు భారతీయుల ఫోన్లు హ్యాక్‌ అవ్వలేదేమోనని తొలుత విశ్లేషణలు వచ్చాయి. అయితే- జాబితాలో ఉన్నవారిలో 10 మంది ఫోన్లపై స్వతంత్ర డిజిటల్‌ ఫోరెన్సిక్‌ విశ్లేషణ జరిపించగా.. వారిపై ఇప్పటికే హ్యాకింగ్‌ ప్రయత్నం జరగడమో, విజయవంతంగా హ్యాకింగ్‌ ముగియడమో పూర్తయిందని తేలింది. దీంతో మిగతావారిపై కూడా ఇప్పటికే హ్యాకింగ్‌ జరిగి ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జాబితాలో ప్రముఖ జర్నలిస్టులు
దేశంలోని పలు ప్రముఖ వార్తాసంస్థలకు చెందిన పాత్రికేయులను హ్యాకింగ్‌కు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో హిందుస్థాన్‌ టైమ్స్‌, ది వైర్‌, ఇండియా టుడే, నెట్‌వర్క్‌ 18, ది హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తదితర సంస్థలకు చెందిన జర్నలిస్టులు ఉన్నారు.

* 2018 జూన్‌ నుంచి 2020 అక్టోబరు మధ్య ఎల్గార్‌ పరిషద్‌ కేసులో అరెస్టయిన ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యావేత్తలకు చెందిన 9 నంబర్లు డేటాబేస్‌లో ఉన్నాయి. దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ మాజీ ప్రొఫెసర్‌ నంబరు కూడా ఉంది.


జాబితాలో ఎవరెవరి నంబర్లున్నాయి..

* మోదీ ప్రస్తుత కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు
* ముగ్గురు కీలక విపక్ష నేతలు
* సుప్రీం కోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి
* 40మంది జర్నలిస్టులు, కొందరు వ్యాపారవేత్తలు  
* భద్రతా సంస్థల ప్రస్తుత, మాజీ అధిపతులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని