Updated : 02/10/2021 10:46 IST

పంచాయతీలకు పక్కాగా నిధులు

సమన్యాయం కోసమే జీవో 60

అది సొమ్ము మళ్లింపు కోసం కాదు

ప్రశ్నోత్తరాలలో సీఎం స్పష్టీకరణ

కాంగ్రెస్‌ జమానాలో సర్పంచుల బాధలు అనేకమని వ్యాఖ్య

ఇప్పుడు సంతోషంగా ఉన్నారని వెల్లడి


‘‘కాంగ్రెస్‌ పాలనలో పంచాయతీలకు తలసరి గ్రాంటు కింద నాలుగు రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రూ.650లకుపైగా ఇస్తోంది. ప్రస్తుతం దేశం గర్వపడేలా తెలంగాణలోని సర్పంచులు ఉన్నారు.’’


ఈనాడు, హైదరాబాద్‌: పంచాయతీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ఖజానాకు రప్పించి అక్కడి నుంచి ఠంచనుగా నెలవారీగా విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సెప్టెంబరు నిధులను కూడా విడుదల చేశామన్నారు. 60వ నంబరు జీవోను ఇచ్చామని.. అది నిధుల మళ్లింపు కోసం కాదన్నారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన సీనరేజ్‌ తదితర నిధులు ఇవ్వటం లేదని, నిధులను మళ్లిస్తున్నారని శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్‌ సభ్యులు లేవనెత్తారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమాధానం చెబుతూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు పలు అంశాలను ప్రస్తావించటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘క్వారీలు, గ్రానైట్‌తోపాటు వివిధ రూపాల్లో పంచాయతీలకు నిధులు వస్తాయి. అవి అన్ని పంచాయతీలకూ రావు. పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండటంతో వాటికి ఆదాయం వస్తుంది. ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి అన్ని పంచాయతీల్లో అభివృద్ధిని ఆవిష్కరించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంతకుమునుపు వరకు పంచాయతీలు మురికి కూపాలుగా ఉన్నాయి. ప్రస్తుతం అవి అభివృద్ధితో ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి చేసిన చట్టానికి లోబడే ఉత్తర్వులు జారీ చేశాం. నిధుల మళ్లింపు అన్నది సత్యదూరం. అవాస్తవం.

అది వారి అవగాహనా రాహిత్యం

కేంద్రం నిధులు ఇవ్వటం అన్నది రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రావాల్సిందే. కేంద్ర దయాదాక్షిణ్యం కాదు. కొందరు సభ్యులు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎందుకు గొంతు నొక్కుతుంది? ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. మీ(కాంగ్రెస్‌) జమానాలో సర్పంచులు బాధపడిన మాట వాస్తవం. మీ హయాంలో చెల్లించాల్సిన కరెంటు బిల్లులు ఇంకా రూ.రెండు వేల కోట్లు పెండింగులో ఉన్నాయి. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు సైతం రాష్ట్ర విధానాలను ప్రశంసిస్తున్నారు. కరోనా సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపైనా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని అధికారులకు స్పష్టం చేశాను. గ్రామాల్లో ప్రజలు మరణిస్తే అంత్యక్రియలు చేసేందుకు మీ ప్రభుత్వ హయాంలో స్థలం కూడా చూపించలేకపోయారు. మా ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసింది. రండి.. రేపే వెళదాం. అన్ని పార్టీల వారితో సభా కమిటీని వేద్దాం. ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే చూద్దాం. సర్పంచులు ఆగమయ్యారని చెబుతున్నారు. ఎక్కడో చెప్పండి. అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రగతిపై సభలో సుదీర్ఘంగా చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని  స్పీకర్‌ను సీఎం కోరారు.

అది చట్టంలో లేదు

‘‘ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు ఇస్తామని మా పార్టీ ఎక్కడా చెప్పలేదు. అసలు అది నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వమే తెచ్చింది. కానీ పంచాయతీల్లో సర్పంచులను కాదని కాంగ్రెస్‌ నాడు సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసింది. మా ప్రభుత్వం దాన్ని పూర్తిగా తీసేసింది. సర్పంచులకు సర్వ స్వేచ్ఛ ఇచ్చింది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

ఎందుకంత ఉలికిపాటు? 

‘బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రానైట్‌, క్వారీలు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో పంచాయతీలకు రావాల్సిన వాటాను ఇవ్వకపోవటంతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. సభ్యుల నుంచి అభ్యంతరం వ్యక్తమైతే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు.పంచాయతీల నిధులను మళ్లించటం ద్వారా ప్రభుత్వం ఆ నిధులపై పెత్తనం చెలాయిస్తోందని శ్రీధర్‌ బాబు మాట్లాడారు.


ఏకగ్రీవ పంచాయతీలకు నిధులేవి?: భట్టి విక్రమార్క

‘ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఇస్తామని ప్రకటించారు. ఇంత వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. రూ.193 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సిబ్బంది కొరత కూడా ఉంది. నిధుల మళ్లింపు సరికాదు. ఉపాధి హామీ కింద కేంద్రం ఇస్తున్న నిధులను కూడా రాష్ట్రం పంచాయతీలకు ఇవ్వటం లేదు. సీతక్క వినియోగించిన భాష బాగోలేదని స్పీకర్‌ అన్నారు. పార్లమెంటరీ భాషనే ఆమె వినియోగించారు. స్పీకర్‌ అలా అనటం బాధించింది.Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని