Updated : 02/10/2021 07:28 IST

Disha Encounter Case: 12 మంది కళ్లలో మట్టి కొట్టిన నిందితుడు

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై ప్రత్యక్షసాక్షి వాంగ్మూలం

ఈనాడు, హైదరాబాద్‌: ‘దిశ’ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై అబ్దుల్‌ రవూఫ్‌ అనే ప్రత్యక్ష సాక్షి శుక్రవారం జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట వాంగ్మూలమిచ్చారు. కమిషన్‌ తరఫు న్యాయవాదులు పరమేశ్వర్‌, విరూపాక్ష గౌడ అడిగిన ప్రశ్నలకు రవూఫ్‌ సమాధానాలిచ్చారు. ‘దిశ’కు సంబంధించిన వస్తువులను దాచిన ప్రాంతాన్ని చూపిస్తానని నిందితుడు ఆరిఫ్‌ చెప్పడంతో పోలీసుల వెంట తానూ చటాన్‌పల్లికి వెళ్లానని చెప్పారు. వస్తువుల్ని వెతికే క్రమంలో ఆరిఫ్‌ రెండు చేతులతో మట్టి విసరడంతో 12 మంది కళ్లలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్‌, చెన్నకేశవులు సీఐ, ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంతమంది పోలీసులు నిందితుల్ని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు ప్రశ్నించారు. తన కళ్లలో మట్టి పడటంతో గమనించలేదని రవూఫ్‌ చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరెంత దూరంలో ఉన్నారు.? అని అడిగితే 3-4 అడుగుల దూరంలో ఉన్నానని బదులిచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఘటనాస్థలి ఫొటోలను చూపించి ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టమని అడిగారు. నిందితుల వాంగ్మూలంలో లేని విషయాలు.. మీ స్టేట్‌మెంట్‌లో ఎందుకున్నాయని ప్రశ్నించగా, దానిని ఎలా నమోదు చేసుకున్నారో తనకు తెలియదని అన్నారు.

ఆన్‌లైన్‌ విచారణలోకి చొరబాటు యత్నం..!

‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై త్రిసభ్య కమిషన్‌ జరుపుతున్న విచారణలోకి చొరబాటుయత్నం జరిగింది. కమిషన్‌ సభ్యులు దిల్లీ, ముంబయి నుంచి ఆన్‌లైన్‌లో విచారణ జరపుతుండగా.. సాక్షులు తెలంగాణ హైకోర్టు నుంచి హాజరవుతున్నారు. శుక్రవారం కమిషన్‌ కంప్యూటర్‌పై పాప్‌అప్‌ నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌ విచారణలో చొరబాటుకు యత్నిస్తున్నట్లు అనుమానించిన కమిషన్‌ వెంటనే అప్రమత్తమైంది. ఎంక్వైరీ ప్రోసీడింగ్‌లనుయాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో విషయాన్ని విచారణను పర్యవేక్షిస్తున్న కమిషన్‌ కార్యదర్శి శశిధర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది.చొరబాటు యత్నంపై దర్యాప్తు చేయాలని స్టేట్‌ కౌన్సిల్‌ ఉమామహేశ్వరరావుకు సూచించింది. హైకోర్టు ప్రాంగణంలోఉన్న కమిషన్‌ కార్యాలయంలోని వైఫై పాస్‌వర్డ్‌ను ఇతరులు వినియోగించడం వల్ల ఇలా జరిగి ఉంటుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.


న్యాయవాదిపై ఆగ్రహం

కాల్పుల సమయంలో ఏ వైపు ఉన్నారని అడిగిన ప్రశ్నకు రవూఫ్‌ తూర్పున అని చెప్పారు. ఓ న్యాయవాది పశ్చిమం అని చెప్పడంతో వెంటనే రవూఫ్‌ మాట మార్చారు. ఈ విషయంలో ఆ న్యాయవాదిపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని వెరిఫై చేయాలని ఆదేశించింది. అంతకుముందు గాంధీ ఆసుపత్రి ఫొరెన్సిక్‌ నిపుణుడు కృపాల్‌సింగ్‌ను న్యాయవాదులు విచారించారు. ‘పాయింట్‌ రేంజ్‌ ఫైరింగ్‌’ గురించి తెలుసా అని అడిగితే బాలిస్టిక్‌ నిపుణులకే ఆ విషయం తెలుస్తుందన్నారు.


 

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని