Cyber Crime: ‘డిజిటల్‌’ దొంగలొస్తున్నారు.. తస్మాత్‌ జాగ్రత్త

ఒకప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి.. బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా సొత్తు దోచేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. మనతోనే తాళాలు (పాస్‌వర్డ్‌లు)

Updated : 30 Oct 2021 05:57 IST

ఆన్‌లైన్‌ మోసాలపై ఆర్‌బీఐ హెచ్చరిక

ఈనాడు వాణిజ్య విభాగం

ఒకప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి.. బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా సొత్తు దోచేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. మనతోనే తాళాలు (పాస్‌వర్డ్‌లు) ఇప్పించుకుని, మనం కళ్లు తెరిచి చూసేలోగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్‌ చేసి నాలుగు మాయమాటలు చెప్పి, డెబిట్‌కార్డుకు ఉండే నాలుగంకెల పిన్‌ నెంబరు తెలుసుకుని.. గుల్ల చేస్తున్నారు. మనం డౌన్‌లోడ్‌ చేసుకునే సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌ల ద్వారా మన రహస్యాల గుట్టు పట్టేస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం కంప్యూటర్‌లో వెబ్‌సైట్లు వెతుకుతుంటే.. మధ్యలో చొరబడి ‘మాల్‌వేర్‌’ వలలు విసిరి మన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఒక్కసారి మన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కిందా.. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పోయినట్లే. ఈ తరహా మోసాలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ)కు, ఆర్‌బీఐ నియమించిన బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ కార్యాలయాలకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ కార్యాలయం డిజిటల్‌ మోసాల తీరుతెన్నులపై సమగ్ర నివేదికను రూపొందించింది. ఎవరికి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ నివేదిక సూచించింది. 

ఇలా మోసపోతాం..

ఆన్‌లైన్లో బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంటే, సైబర్‌ మాయగాళ్లకు చిక్కే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. అత్యధిక శాతం సైబర్‌ మోసాలు ఇక్కడే జరుగుతాయి.


డౌన్‌లోడ్లు, మొబైల్‌ యాప్‌ల ద్వారా

మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌టాప్‌లపై నిర్ధారణ కాని సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఇటువంటి అప్లికేషన్లను సాధారణంగా ఎస్‌ఎంఎస్‌/ సోషల్‌ మీడియా/ ఇన్‌స్టెంట్‌ మెసెంజర్‌ ద్వారా షేర్‌ చేస్తుంటారు. అందువల్ల వీటిని పూర్తిగా నమ్మలేం. సైబర్‌ నేరస్తులు యాప్స్‌ ముసుగులో మన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. ఒకసారి దాన్ని మనం డౌన్‌లోడ్‌ చేసుకుంటే మన కంప్యూటర్‌/ సెల్‌ఫోన్‌ వాళ్ల అధీనంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.


స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌/ రిమోట్‌ యాక్సెస్‌

స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లను మనం డౌన్‌లోడ్‌ చేసుకునేలా మాయగాళ్లు వల విసురుతారు. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగానే మనం సిస్టమ్‌/ మొబైల్‌ ఫోన్‌ వాళ్ల అజమాయిషీలోకి వెళ్లిపోతుంది. దాంతో మన బ్యాంకు ఖాతా నుంచి సులువుగా సొమ్ము లాగేస్తారు.


సిమ్‌ స్వాప్‌/ క్లోనింగ్‌

చాలా వరకు డిజిటల్‌ లావాదేవీల్లో సెల్‌ఫోన్‌ నంబరే కీలకం. అందువల్ల మోసగాళ్లు మన సెల్‌ఫోన్‌ సిమ్‌ కార్డును క్లోనింగ్‌ చేసేందుకు లేక డూప్లికేట్‌ సిమ్‌ కార్డు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు, ఆ ప్రయత్నంలో వారు విజయం సాధిస్తే మనకు కోలుకోని నష్టం జరిగినట్లే. ఇటువంటి మోసగాళ్లు మనకు ఫోన్‌ చేసి, సిమ్‌ కార్డును అప్‌గ్రేడ్‌ చేయడానికి, లేదా మరొక అవసరం ఉందని చెబుతూ పూర్తి వివరాలు తెలుసుకుంటారు.


క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా మోసాలు

మోసగాళ్లు మనకు ఫోన్‌ చేసి ఒక క్యూ ఆర్‌ కోడ్‌ పంపుతామని, దాన్ని స్కాన్‌ చేస్తే మీకు ఫలానా ప్రయోజనం లభిస్తుందని చెబుతారు. తొందరపడి దాన్ని స్కాన్‌ చేస్తే నష్టపోతాం.


మీ స్నేహితుడి నకిలీ ఖాతాతో

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో మీకు తెలిసిన వారి పేరుతో నకిలీ ఖాతాలను సృష్టిస్తారు. మీకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడతారు. ఆ తర్వాత అత్యవసరం అంటూ ఆ ఖాతా నుంచి డబ్బు అడుగుతారు. స్నేహితుడే కదా అని మీరు పంపిస్తారు. ఒక్కోసారి ప్రైవేట్‌ చాట్‌చేసి దాని ఆధారంగా బ్లాక్‌ మెయిల్‌కూ పాల్పడతారు.


జ్యూస్‌ జాకింగ్‌ ద్వారా

మొబైల్‌ ఛార్జింగ్‌ పోర్టు కూడా ఫైల్స్‌/డేటా బదిలీకి ఉపయోగించే అవకాశం ఉంది. దీన్నే జ్యూస్‌ జాకింగ్‌ అంటారు. మీకు తెలియని ప్రదేశాల్లోని ఛార్జింగ్‌ పోర్టుల్లో మొబైల్‌ పెట్టినా, తెలియని యాప్‌లను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నా.. మీ ఆర్థిక సమాచారం, వ్యక్తిగత సమాచారం తస్కరించే ప్రమాదముంది. ఆ తర్వాత మనల్ని మోసం చేయడం చాలా సులువు.


లాటరీ వచ్చిందంటారు

మనకు ఫోన్‌ వస్తుంది. భారీ మొత్తంలో లాటరీ తగిలందంటారు. ఆ డబ్బు దక్కాలంటే, నగదు బదిలీ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజు కింద కొంత మొత్తం కట్టాలంటారు. లాటరీతో పోలిస్తే అడిగే మొత్తం చాలా చిన్నదే కదా అని మనం కడతాం. అంతే ఇక అవతలి ఫోన్‌ పనిచేయదు.


ఉద్యోగమిస్తామంటారు

నకిలీ ఉద్యోగ పోర్టల్‌ను సృష్టిస్తారు. రిజిస్ట్రేషన్‌ నిమిత్తం బ్యాంకు ఖాతా/క్రెడిట్‌ కార్డు/డెబిట్‌ కార్డు వివరాలు అడుగుతారు. కొన్ని కేసుల్లో కంపెనీ అధికార్లుగా మోసగాళ్లు నకిలీ ఇంటర్వ్యూలూ చేస్తారు. శిక్షణ కోసం కొంత డబ్బు అడుగుతారు. ఇవన్నీ నమ్మామో అంతే.


ఎన్‌బీఎఫ్‌సీ ఖాతాదార్లకూ ముప్పు

బ్యాంకు వినియోగదార్లలో చాలా వరకు చదువుకున్నవారు ఉండొచ్చు. కానీ ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ) ఖాతాదార్లలో ఎక్కువమందికి తగిన అవగాహన ఉండదు. కొందరు నిరక్షరాస్యులూ ఉంటారు. ఇటువంటి వారు మోసగాళ్ల గాలానికి సులువుగా చిక్కుతున్నారు.


నకిలీ వ్యాపార ప్రకటనలు

వ్యక్తిగత రుణాలూ ఇస్తామంటూ మోసగాళ్లు నకిలీ వ్యాపార ప్రకటనలు ఇస్తారు. ఆకర్షణీయ వడ్డీ రేట్లు, సులభ వాయిదాలు, ఎటువంటి హామీ అవసరం లేదంటూ ఊదరగొడతారు. తమను సంప్రదించమంటారు. ఎన్‌బీఎఫ్‌సీల్లోని సీనియర్‌ అధికార్లను పోలిన ఇమెయిళ్ల ద్వారా వినియోగదార్లకు మరింత నమ్మకం పెంచుతారు. రుణాల కోసం వీరిని కలిసినపుడు అడ్వాన్స్‌ ఈఎంఐ అనో.. ప్రాసెసింగ్‌ ఫీజు అనో.. ఇలా ఏదో పేరుతో డబ్బులు గుంజుతారు. మళ్లీ కనిపించరు.


సామాజిక మాధ్యమాల్లోనూ

కేవలం నకిలీ వ్యాపార ప్రకటనల రూపంలోనే కాదు.. ఇన్‌స్టంట్‌ మెసెంజర్‌/ఎస్‌ఎమ్‌ఎస్‌/సామాజిక మాధ్యమాల్లో నకిలీ సంక్షిప్త సమాచారాలను వీరు సర్క్యులేట్‌ చేస్తారు. ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీకి చెందిన అధికారిక లోగోతోనే ఇవన్నీ చేస్తారు. కావాలంటే వారి ఆధార్‌కార్డు పాన్‌ కార్డు, నకిలీ ఎన్‌బీఎఫ్‌సీ ఐడీ కార్డును కూడా చూపిస్తారు. మెల్లగా ముగ్గులోకి దింపుతారు. ఏవో ఛార్జీల పేరిట డబ్బు గుంజేస్తారు.


ఓటీపీ మోసాలిలా

మీ ఎన్‌బీఎఫ్‌సీ రుణ పరిమితిని పెంచుతామనో.. లేదంటే మరో కొత్త రుణం ఇస్తామనో, మోసగాళ్లు మీ మొబైల్‌కు సమాచారం ఇస్తారు. మీరు కాల్‌ చేసిన వెంటనే కొన్ని ఫారాలు నింపాలంటారు. నమ్మకం కుదిరాక.. రుణానికి సంబంధించి ఓటీపీ లేదా పిన్‌ వస్తుందని చెప్పి వాటిని తస్కరిస్తారు. ఒక్కసారి ఓటీపీ వారి చేతికెళ్లిందా.. అంతే సంగతులు.


యాప్‌ల ద్వారా

ఇన్‌స్టంట్‌, స్వల్పకాల రుణాలను ఆఫర్‌ చేస్తూ కొన్ని యాప్‌లు ఉన్నాయి. వీటిలానే కనిపించేలా యాప్‌లను రూపొందించే కేటుగాళ్లూ ఉన్నారు. ‘పరిమిత కాల ఆఫర్‌’ ఉందంటూ వల్లోకి లాగుతారు. దరఖాస్తుదారులకు ఆలోచించుకునే సమయం లేకుండా చేస్తారు. మన ఆర్థిక వివరాలు ఇచ్చామా.. మన జుట్టు వారి చేతికి వెళ్లినట్లే.


పోంజీ తరహా స్కామ్‌లు

పేరు ఏదైనా మోసం జరిగే విధానం ఒకటే. ‘మీరు చేరండి.. మరింతమందిని ఈ పథకంలోకి చేర్చండి. భారీ ప్రతిఫలాలు అందుతాయి’ అంటూ ఊరిస్తారు. ఇలా గొలుసుకట్టుగా పోంజీ తరహా మోసాలకు పాల్పడతారు. కొత్తగా చేరే సభ్యులు ఇక లేరని తేలిపోయాక.. ఈ పథకాన్ని మూసివేస్తారు.


ఏటీఎం కార్డు స్కిమ్మింగ్‌

ఏటీఎం కేంద్రాల నుంచి వినియోగదార్ల కార్డుల సమాచారాన్ని తస్కరించి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము కొట్టేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఇటువంటి మోసగాళ్లు ఏటీఎం యంత్రాల్లో ‘స్కిమ్మింగ్‌ డివైసెస్‌’ అమర్చుతున్నారు. డమ్మీ కీప్యాడ్‌/ చిన్న పిన్‌హోల్‌ కెమెరా పెట్టి, మనం లావాదేవీ నిర్వహించేప్పుడు ఏటీఎంలో నొక్కే పిన్‌ నంబరు తెలుసుకుంటారు. ఒక్కోసారి ఏటీఎం పక్కనే సాధారణ వినియోగదారుల మాదిరిగా నిలబడి మన పిన్‌ నంబరును గమనిస్తారు. ఆ తర్వాత మనకు తెలీకుండా మన ఖాతా నుంచి సొమ్ము తస్కరిస్తారు.

ఏటీఎం కేంద్రానికి వెళ్లినప్పుడు ఇటువంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి.


విషింగ్‌ కాల్స్‌

గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ లేదా సోషల్‌ మీడియా పోస్ట్‌ మనకు వస్తుంది. ఫలానా బ్యాంకు/ బీమా కంపెనీ/ ప్రభుత్వ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటారు. మనకు నమ్మకం కలిగించడం కోసం మన పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు చెబుతారు. బ్యాంకు ఖాతా/ కార్డు వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉందంటూ, తమకు కావలసిన వివరాలు అడుగుతారు. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది, చూసి చెప్పండి.. అంటారు. అది చెప్పామా, మన బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే. ఇటువంటి ఫోన్‌ కాల్స్‌, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

బ్యాంకులు కానీ, ఇతర సంస్థలు కానీ మనకు ఫోన్‌ చేసి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌, కార్డు వివరాలు, సీవీవీ నెంబరు, ఓటీపీ అడగవని గుర్తించాలి.


నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చు

దుకాణానికికెళ్లి ఏదైనా కొంటే జేబులోంచి పర్సు తీసి బిల్లు చెల్లించడం పాత పద్ధతి.. ఇప్పుడు జేబులోంచి తీసేది పర్సు కాదు.. మొబైల్‌. అక్కడున్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి చటుక్కున బిల్లు చెల్లించడం మామూలైపోయింది. డిజిటల్‌ చెల్లింపులకు ఎన్నో యాప్స్‌, వాలెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఇప్పుడంతా మొబైల్‌ లావాదేవీలే. ఇదే క్రమంలో రకరకాల అవసరాలపై మనం డౌన్‌లోడ్‌ చేసుకునే సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌ల ద్వారా లేదా అనేకరకాల లింక్‌లతో సైబర్‌ నేరగాళ్లు ‘మాల్‌వేర్‌’ చొప్పించి మన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఈ తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) అంబుడ్స్‌మన్‌ కార్యాలయం సమగ్ర నివేదికను రూపొందించింది. ఎవరికి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ నివేదిక సూచించింది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సమయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక సూచించింది. కొద్దిపాటి జాగ్రత్తలతో ఆన్‌లైన్‌ మోసాల నుంచి తప్పించుకోవచ్చని వివరించింది. ఒకవేళ మోసగాళ్ల బారిన పడితే నిర్లిప్తంగా ఊరుకోకూడదని.. ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసు, ఆర్‌బీఐ, సెబీ లేదా సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలని సూచించింది. స్వయంగా వెళ్లలేని పక్షంలో జరిగింది వివరిస్తూ అందుబాటులో ఉన్న ఆధారాలను జోడిస్తూ ఆన్‌లైన్లోనే ఫిర్యాదు చేస్తే వీలైనంత వరకు మోసగాళ్ల భరతం పట్టే వీలుంటుందని పేర్కొంది.


ఆన్‌లైన్లో ఫిర్యాదు చేయవలసిన వెబ్‌సైట్లు..

* సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌: సైబర్‌క్రైమ్‌.జీఓవీ.ఇన్‌

* ఆర్‌బీఐ: సీఎంస్‌.ఆర్‌బీఐ.ఓఆర్‌జీ.ఇన్‌

* సెబీ: స్కోర్స్‌.జీఓవి.ఇన్‌ 

* ఐఆర్‌డిఏఐ: ఐజీఎంఎస్‌.ఐఆర్‌డీఏ.జీఓవి.ఇన్‌

* నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ : జీఆర్‌ఐడీఎస్‌.ఎన్‌హెచ్‌బీఆన్‌లైన్‌.ఓఆర్‌జీ.ఇన్‌


ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు

* వెబ్‌సైట్లు చూస్తున్నపుడు అనుమానాస్పదంగా ‘పాప్‌ అప్స్‌’ కనిపిస్తే, వెంటనే అప్రమత్తం కావాలి.

* ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేందుకు సెక్యూర్డ్‌ పేమెంట్‌ గేట్‌వే (హెచ్‌టీటీపీఎస్‌:// - యూఆర్‌ఎల్‌, ప్యాడ్‌ లాక్‌ సింబల్‌తో...)ను మాత్రమే వినియోగించాలి.

* పిన్‌, పాస్‌వర్డ్‌, క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు నంబరు, సీవీవీలను రహస్యంగా ఉంచుకోవాలి.

* టూ-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ సదుపాయాన్ని ఆన్‌ చేసి పెట్టుకోవాలి.

* తెలియని సోర్స్‌ నుంచి వచ్చిన, అనుమానాస్పదమైన అటాచ్‌మెంట్స్‌/ ఫిషింగ్‌ లింక్స్‌ ఉన్న ఈమెయిళ్లను చూడవద్దు.

* బ్యాంకు కేవైసీ పత్రాలను తెలియని వారికి ఇవ్వరాదు.


సెల్‌/ కంప్యూటర్‌ భద్రత

* పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మార్చుకుంటూ ఉండాలి. పాస్‌వర్డ్‌లు, రహస్య సమాచారాన్ని కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లలో స్టోర్‌ చేయకూడదు.

* నమ్మకమైన యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలి.

* తెలియని యూఎస్‌బీ డ్రైవ్స్‌/ డివైజెస్‌ను వినియోగించే ముందు తప్పనిసరిగా స్కాన్‌ చేయాలి.


ఇ-మెయిల్‌ అకౌంట్‌/ పాస్‌వర్డ్‌ సెక్యూరిటీ

* తెలియని అడ్రసు నుంచి వచ్చిన ఈమెయిళ్లను క్లిక్‌ చేయవద్దు. పబ్లిక్‌/ ఉచిత నెట్‌వర్క్స్‌లో ఈమెయిళ్లు వాడవద్దు. ఈమెయిళ్లలో బ్యాంకు ఖాతా నంబరు, పాస్‌వర్డ్‌.. వంటి ముఖ్యమైన సమాచారాన్ని నిల్వ చేయటం సరికాదు.

* ఆల్ఫా న్యూమరిక్‌, స్పెషల్‌ క్యారెక్టర్‌ కాంబినేషన్‌తో పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకోవాలి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని