కాళేశ్వరం భూసేకరణపై స్టే

కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా 1.1 టీఎంసీల నీటికి క్రాస్‌ డ్రైనేజీ తదితరాలకు తరలించే నిమిత్తం జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం....

Updated : 27 Nov 2021 02:50 IST

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అనుమతి లేకుండా ఎలా ముందుకెళ్తారని ప్రశ్న

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా 1.1 టీఎంసీల నీటికి క్రాస్‌ డ్రైనేజీ తదితరాలకు తరలించే నిమిత్తం జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సెప్టెంబరు 27న జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన సీహెచ్‌.శ్రీహరి, మరో నలుగురు రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపించారు. ‘‘2015-16లో ప్రాణహిత-చేవెళ్ల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజులపాటు గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు చేపట్టారు. 2019లో ప్రాజెక్టు పూర్తికావొస్తున్న దశలో అదనపు టీఎంసీకి ప్రతిపాదించారు. సామర్థ్యం పెంచే ముందు డీపీఆర్‌ రూపొందించలేదు.  కేంద్ర పర్యావరణ శాఖ సహా చట్టబద్ధ సంస్థల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోలేదు’ అని న్యాయవాది వివరించారు. అనుమతుల్లేకుండా పనులు చేపట్టరాదంటూ గత ఏడాది ఎన్జీటీ ఆదేశాలు జారీచేసిందని, అనుమతుల్లేని అదనపు సామర్థ్యం పనులను చేపట్టరాదంటూ కేంద్ర జలశక్తి శాఖ గత ఏడాది డిసెంబరు 11న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భూసేకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా నేరుగా సెక్షన్‌ 11(1) కింద  భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేశారని వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఎన్జీటీ ఉత్తర్వులతోపాటు అదనపు నీటి వినియోగానికి కేంద్ర జలశక్తి శాఖ అనుమతుల్లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అనుమతుల్లేకుండా ఎలా ముందుకెళ్తారని ప్రశ్నిస్తూ పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతవరకు భూసేకరణ ప్రక్రియ చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని