Updated : 27/11/2021 02:50 IST

‘మహా’ విద్యుల్లత

15 రాష్ట్రాల కన్నా హైదరాబాద్‌లోనే గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ 

భారీగా పెరుగుతున్న జనావాసాలు

5 వేల మెగావాట్లకు అవసరమైన సరఫరా వ్యవస్థకు ఏర్పాట్లు

ఈనాడు - హైదరాబాద్‌

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రాజధాని నగరానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటికన్నా గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూవారీ విద్యుత్తు డిమాండ్‌ ఎక్కువ ఉంటోంది. ఆ రాష్ట్రాల్లో ఒక్కోదానిలో ఒకరోజు వినియోగించే మొత్తం కరెంటుకన్నా ఇక్కడే అధికంగా ఉంటుండటం గమనార్హం. హైదరాబాద్‌లో గరిష్ఠ రోజూవారీ డిమాండ్‌ గత వేసవిలో 3,431 మెగావాట్లు నమోదైంది. ఇది వచ్చే వేసవికి 4,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్న విద్యుత్‌ సంస్థలు పంపిణీ, సరఫరా వ్యవస్థ మెరుగుపై దృష్టి పెట్టాయి. 5,000 మెగావాట్ల సరఫరాకు సరిపడేలా లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిని పెంచుతున్నాయి. ఏటా సాధారణంగా 7 నుంచి 8 శాతం వరకూ విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుంటుంది. కానీ గ్రేటర్‌ పరిధిలోని కొన్ని సర్కిళ్లలో గరిష్ఠ డిమాండ్‌ ఏడాదిలోనే 10 నుంచి 20 శాతం పెరుగుతోంది. దీన్ని తట్టుకునేలా సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడానికి రూ.వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఐటీ కారిడార్‌లో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా రాయదుర్గంలో రూ.1200 కోట్లతో 400 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నగరం చుట్టూ ఇలాంటి 400 కేవీ స్థాయి సబ్‌స్టేషన్లు 6 నిర్మించారు. బౌరంపేట, చంచల్‌గూడ ప్రాంతాల్లో 132 కేవీ సబ్‌స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు.

జనావాసాలు, ఆకాశహర్మ్యాలు పెరగడమే కారణం

గ్రేటర్‌ చుట్టూ వెలుస్తున్న కాలనీలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమల వల్ల గరిష్ఠ డిమాండ్‌ ఏటా భారీగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 30 నుంచి 50 అంతస్తులతో నిర్మిస్తున్న అపార్టుమెంట్లకు వందల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ సరఫరా వ్యవస్థలను కొత్తగా ఏర్పాటుచేయాల్సి వస్తోంది. పది, పదిహేనేళ్ల క్రితం 400 నుంచి 1000 గజాల స్థలంలో ఇల్లో, ఇళ్ల సముదాయాల్లో నిర్మించుకున్న పలు కుటుంబాలు ఇప్పుడు మరింత ఆదాయం కోసం ఆ స్థలాల్లో అపార్టుమెంట్ల నిర్మాణానికి అంగీకరిస్తున్నాయి. ఉదాహరణకు నగర శివారులో 400 గజాల చొప్పున రెండు స్థలాల్లో పక్కపక్కనే ఇళ్లు ఉండగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాటి యజమానులను ఒప్పించి వాటిని కూలగట్టి 40 ఫ్లాట్లలో భారీ అపార్టుమెంటు కట్టారు. అంతకుముందు అక్కడ ఉన్న రెండు ఇళ్లకు కలిపి నెలకు 1000 యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉండేది కాదు. కానీ ఇప్పుడు 40 ఫ్లాట్లు రావడంతో నెలవారీ వినియోగం 20,000 యూనిట్లు దాటింది. ఆ స్థాయిలో సరఫరాకు ఆ ప్రాంత విద్యుత్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాల్సి వచ్చింది. ఇలాగే కోకాపేటలో ఇటీవల ప్రభుత్వం భూములు వేలం వేసింది. ఒక్కో స్థలం 2 నుంచి 5 ఎకరాల దాకా ఉన్నందున అక్కడ భారీ ఆకాశహర్మ్యాలు, భవనాలు వస్తాయనే ఉద్దేశంతో అక్కడ 400 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న గచ్చిబౌలితో పాటు సైబరాబాద్‌ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని