రాజకీయ పార్టీల మధ్య పోటీ శత్రుత్వం కారాదు

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సర్వోన్నత శిఖరం. దీని గౌరవాన్ని కాపాడటంలో అధికార, విపక్షంలో ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ బాధ్యత ఉంటుంది.

Updated : 27 Nov 2021 04:57 IST

చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిదీ

ఎంపీలకు రాష్ట్రపతి కోవింద్‌ హితవు

కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు

ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక

పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

కాంగ్రెస్‌ సహా 15 విపక్షాల గైర్హాజరు

ఈనాడు, దిల్లీ: ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సర్వోన్నత శిఖరం. దీని గౌరవాన్ని కాపాడటంలో అధికార, విపక్షంలో ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ బాధ్యత ఉంటుంది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రజాప్రతినిధులందరూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. ఆలోచనా ధోరణుల్లో ఉండే విభేదాలు ప్రజాసేవకు అడ్డంకిగా మారేంత పెద్దవిగా ఉండకూడదు’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల మధ్య స్పర్థను పోటీగా భావించాలే గాని వైరి భావంతో చూడొద్దని హితవు పలికారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటు సెంట్రల్‌హాలులో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగ రాత ప్రతి డిజిటల్‌ వెర్షన్‌ను విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ప్రసంగించారు. లోక్‌సభ సచివాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు బీజేడీ, వైకాపా, తెరాస, బీఎస్పీ, తెలుగుదేశం ఎంపీలు హాజరయ్యారు. కాంగ్రెస్‌, వామపక్షాలు సహా 15 విపక్ష పార్టీల ఎంపీలు గైర్హాజరయ్యారు. ‘భారత రాజ్యాంగం దేశ ప్రజల సామూహిక అభివ్యక్తీకరణ ప్రతిరూపం’ అని రాష్ట్రపతి కోవింద్‌ తెలిపారు. ప్రపంచంలో ఏ రాజ్యాంగమూ  చేయలేని విధంగా మన రాజ్యాంగ నిర్మాతలు మొదటి నుంచే వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారని తెలిపారు. ఇంగ్లండ్‌, అమెరికా లాంటి దేశాల్లో సుదీర్ఘకాల సంఘర్షణ తర్వాతే మహిళలకు ఓటు హక్కు లభించిందని గుర్తుచేశారు. రాజ్యాంగ నిర్మాణంలో జాతిపితలే (ఫౌండింగ్‌ ఫాదర్స్‌) కాకుండా జాతిమాతృమూర్తులు (ఫౌండింగ్‌ మదర్స్‌)లూ పాలుపంచుకున్నారని ప్రశంసించారు.


చట్టసభ సభ్యులు ఓర్పుతో ఉండాలి

 ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

పార్లమెంటు సభ్యులు చట్టసభల్లో సంభాషణ, చర్చ అన్న సిద్ధాంతానికి కట్టుబడి వ్యవహరించాలే తప్ప నిరంతర ఆందోళనలతో సభాకార్యకలాపాలను అడ్డుకోకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవుపలికారు. రాజ్యసభ ఉత్పాదకత క్రమంగా తగ్గుముఖం పడుతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చినట్లేనని, అందువల్ల చట్టసభ సభ్యులందరూ ఆ ప్రజాభిప్రాయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓర్పుతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.


అవినీతిపరులను ప్రోత్సహించవద్దు

 ప్రధాని నరేంద్ర మోదీ

‘అవినీతిపరులకు అండగా నిలవడమంటే కొత్తతరాన్ని దోపిడీ దారిలో వెళ్లమని ప్రోత్సహించడమే అవుతుంది. మన రాజ్యాంగంలో అవినీతికి తావులేదు. అలాంటి వారితో సన్నిహితంగా తిరిగితే అవినీతి చేయడం తప్పేమీ కాదన్న భావనను యువతరానికి కల్పించిన వాళ్లం అవుతాం’ అని ప్రధాని మోదీ హెచ్చరించారు. అవినీతి కేసుల్లో న్యాయస్థానాలు శిక్ష విధించిన తర్వాత కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వారిని మహిమాన్వితులుగా భావిస్తూ పోతే ఈ దేశ యువత మనసుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్య భావనకు, రాజ్యాంగ ఆదర్శాలకు పూర్తి విరుద్ధమని తెలిపారు. పార్టీని తరతరాలుగా ఒకే కుటుంబం నడుపుతూ ఉంటే, పార్టీ వ్యవస్థ మొత్తం ఆ కుటుంబం చేతుల్లోకి వెళ్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.


భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అభివృద్ధికి అవరోధం

సుప్రీంకోర్టు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ప్యారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నది మన దేశం మాత్రమే. అయినప్పటికీ పర్యావరణం పేరుతో వివిధ రకాల ఒత్తిళ్లు మనపై తెస్తున్నారు. ఇదంతా వలస పాలన మనస్తత్వ ఫలితమే’’నని తెలిపారు. దురదృష్టవశాత్తు ఇటువంటి ఆలోచనా ధోరణులతో మన దేశంలోనూ అభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్నారు. కొన్నిసార్లు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, మరోసారి ఇంకో పేరుతో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఇటువంటి అడ్డంకులను తొలగించుకోవడానికి రాజ్యాంగం బలమైన సాధనమని పేర్కొన్నారు.


విపక్షాల బహిష్కరణ బాధాకరం: ఓం బిర్లా

పార్లమెంటులో జరిగే చర్చల నుంచి పుట్టుకొచ్చే అమృతం సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. లోక్‌సభ సచివాలయం ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించడం బాధాకరమని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషి, రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్‌ గోయల్‌, పార్లమెంటు ఉభయసభల సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌, ఎస్పీ, ఆప్‌, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్‌సీపీ, శివసేన, శిరోమణి అకాలీదళ్‌, టీఎంసీ, ఆర్జేడీ సహా 15 పార్టీల సభ్యులు గైర్హాజరయ్యారు. రాజ్యాంగ మౌలిక నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు నిరంకుశ విధానాలను అనుసరిస్తున్న భాజపా ప్రభుత్వ తీరుకు నిరసనగానే కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు కాంగ్రెస్‌ తెలిపింది.


అధికార, విపక్ష సభ్యుల మధ్య స్పర్ధలు సహజం. అవి ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మరింత మేలు చేయడానికి ఉపయోగపడాలి. అప్పుడే దాన్ని ఆరోగ్యకరమైన పోటీగా భావించగలం. పార్లమెంటులో ప్రతి స్పర్ధనూ వైరి భావంతో చూడకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు దేవాలయం వంటిది. ప్రతి సభ్యుడూ పూజ గదిలో ఎంత భక్తి,శ్రద్ధలతో ఉంటారో అలాగే పార్లమెంటులోనూ వ్యవహరించాలి. ప్రభావశీలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.

- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌


కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పెరిగిపోతుండటం ఆందోళనకరం. కొన్ని పార్టీలు కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం ద్వారా నడుస్తున్నాయి. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకం. ఒక కుటుంబం నుంచి ఒకరికి మించి ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావొద్దని చెప్పడంలేదు. యోగ్యత ఆధారంగా, ప్రజల ఆశీర్వాదంతో ఓ కుటుంబం నుంచి ఎంత మందైనా రాజకీయాల్లోకి రావొచ్చు. దానివల్ల పార్టీ కుటుంబ పార్టీగా మారదు. కానీ ఒక పార్టీని తరతరాలుగా ఒకే కుటుంబం నడుపుతూ ఉంటే పార్టీ వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అది అవరోధంగా నిలుస్తుంది.

- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు