తెలంగాణలో పేదలు 13.74%

తెలంగాణలో 13.74 శాతం ప్రజలు పేదలని నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల స్థితిగతులను తెలుసుకోవడానికి నీతిఆయోగ్‌ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 నిర్వహించింది.

Published : 27 Nov 2021 03:56 IST

అత్యధిక పేదలున్న రాష్ట్రం... బిహార్‌

తెలంగాణకు 18...ఆంధ్రప్రదేశ్‌కు 20వ స్థానం

బహుముఖ కోణాల్లో నీతిఆయోగ్‌ మదింపు

మౌలిక వసతులు, ప్రమాణాల ఆధారంగా విశ్లేషణ

ఈనాడు, దిల్లీ

తెలంగాణలో 13.74 శాతం ప్రజలు పేదలని నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల స్థితిగతులను తెలుసుకోవడానికి నీతిఆయోగ్‌ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 నిర్వహించింది. ఇప్పటివరకు పేదరికాన్ని ఆదాయం, వినియోగం, ఖర్చు ఆధారంగా అంచనా వేస్తూ రాగా... ఈసారి విద్య, వైద్యం, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలికవసతుల ఆధారంగా మదించారు. బహుముఖ కోణాల్లో పేదరికం (మల్టీ డైమన్షనల్‌ పావర్టీ)ను విశ్లేషిస్తూ రూపొందించిన నివేదికను తాజాగా విడుదల చేశారు. దీని ప్రకారం అత్యధిక సంఖ్యలో పేదలున్న రాష్ట్రాలుగా బిహార్‌ (51.91 శాతం), ఝూర్ఖండ్‌ (42.16), ఉత్తర్‌ప్రదేశ్‌ (37.79) తొలి మూడు స్థానాల్లో నిలిస్తే, తెలంగాణ 18వ స్థానంలో ఉంది.  ఆంధ్రప్రదేశ్‌ 12.31 శాతం బహుముఖ పేదలతో 20వ స్థానంలో ఉంది. ఈ నివేదిక వల్ల జిల్లాస్థాయి వరకు జీవన ప్రమాణాలను అంచనా వేసేందుకు, సూక్ష్మ స్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు వీలవుతుందని నీతిఆయోగ్‌ తెలిపింది. ఎంతమంది పేదలు ఉన్నారన్న సంఖ్య తెలియడంతో పాటు, వారు ఏ విధంగా పేదలన్నదీ స్పష్టంగా తెలిసి వస్తుంది... ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాలు వనరులు కేటాయించేందుకు వీలవుతుందని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పేదలున్న జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్‌,  అతి తక్కువ మంది ఉన్న జిల్లాగా హైదరాబాద్‌ నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని