జడ్జీలపై దాడులను అడ్డుకోవాలి

న్యాయాధికారులు, న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో....

Updated : 27 Nov 2021 04:44 IST

భౌతికంగా, సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతున్న దారుణాలు

ఇవి ప్రేరేపితంలా కనిపిస్తున్నాయ్‌

రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్య

న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాలని పిలుపు

ఈనాడు, దిల్లీ: న్యాయాధికారులు, న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమంలోను, అంతకుముందు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘న్యాయాధికారులపై భౌతికదాడులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మీడియాలో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపైనా దాడి జరుగుతోంది. ఇవన్నీ ఎవరి ప్రాయోజికత్వంలోనో జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి’’ అని అన్నారు. వీటిని చట్టాలను అమలుచేసే వ్యవస్థలు, కేంద్ర సంస్థలు, న్యాయవాదులు అడ్డుకోవాలి అని కోరారు. ఏది మంచో, ఏది కాదో చెప్పడానికి సిగ్గుపడొద్దు, భయపడొద్దు అని, న్యాయవాదులు కూడా విస్తృత కుటుంబంలో భాగస్వాములేనని, వారు కోర్టుకు సహకరించాలని కోరారు.

సామాన్యుడికి మరింత చేరువ

దేశ పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలని జస్టిస్‌ రమణ ఆకాంక్షించారు. ‘‘న్యాయవ్యవస్థలో విస్తృతస్థాయిలో సంస్కరణలు తీసుకురావాలి. ఈ ఉద్దేశంతోనే నేను ‘భారతీయీకరణ’ అన్న పదాన్ని ప్రయోగిస్తున్నాను. ప్రస్తుతం మన దేశంలో కొనసాగుతున్న న్యాయవ్యవస్థ ఇప్పటికీ వలసపాలన గుణాన్నే కలిగి ఉంది. సామాజిక వాస్తవాలు, స్థానిక పరిస్థితులను అది పరిగణలోకి తీసుకోవడంలేదు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వాదనలు, తీర్పుల్లో ఉపయోగించే భాష, అందులో ఇమిడి ఉన్న అధిక ఖర్చులు సామాన్యుడిని న్యాయవ్యవస్థకు దూరం చేస్తున్నాయి. అందువల్ల ధైర్యంగా కోర్టులను ఆశ్రయించే నమ్మకాన్ని ప్రజల్లో నెలకొల్పాల్సి ఉంది. కక్షిదారులు న్యాయప్రక్రియలో నేరుగా పాల్గొనప్పుడు మాత్రమే వ్యవస్థపై వారికి నమ్మకం ఏర్పడుతుంది. అనవసరమైన అడ్డంకులను తొలగించి మొత్తం న్యాయప్రక్రియను సరళీకృతం చేయాలి. స్థానిక భాషల వినియోగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డారు.

వారి అధికారాల్లో జోక్యం లేదు

రాజ్యాంగం పెట్టుకున్న నమ్మకాన్ని ఒక వ్యవస్థగా న్యాయస్థానాలు నిలబెట్టాయని జస్టిస్‌ రమణ అన్నారు. ‘‘కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు రాజ్యాంగం నిర్దేశించిన మార్గానికి అతీతంగా మళ్లితే అది న్యాయవ్యవస్థకు అదనపు భారంగా పరిణమిస్తుంది. న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం న్యాయస్థానాలు దృష్టిసారించాల్సిన విధిలేని పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి. కొన్ని అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం వెనుక ఉద్దేశం కార్యనిర్వాహక వ్యవస్థను కదిలించడమే తప్ప దాని పరిధిలోకి జొరబడటంకాదు. రాజ్యాంగబద్ధంగా అవసరమైన ఇలాంటి జోక్యాన్ని అధికారాల ఆక్రమణగా అభివర్ణించడం పూర్తిగా అసంబద్ధం’’ అని అన్నారు. ప్రజలకు న్యాయం చేయడం కేవలం న్యాయ వ్యవస్థ పని మాత్రమే కాదని; చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలకు కూడా బాధ్యత ఉందని అన్నారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య రాజ్యాంగపరమైన లక్ష్మణ రేఖ ఉందని, ఇది చాలా పవిత్రమైనదని అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని కార్యనిర్వాహక వ్యవస్థను కాస్త ముందుకు తోయడానికే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయే తప్ప వాటి అధికారాలను లాక్కోవడానికి కాదని అన్నారు.  


పెండింగ్‌ కేసులు ఆందోళనకరం

కోర్టుల్లో ఏళ్లతరబడి కేసులు పెండింగ్‌లో ఉండడంపై జస్టిస్‌ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కేవలం పోస్టు కార్డు ఆధారంగా పరిష్కారాలు చూపే న్యాయవ్యవస్థే మరోవైపు ఏళ్లతరబడి కొనసాగుతున్న కేసులకు సంక్లిష్టమైన కారణాలవల్ల పరిష్కారాలను చూపలేకపోతోంది. ఇలాంటి వాటికి పరిష్కారం ఎలా అన్నదే ఇప్పుడు ప్రశ్న. పెండింగ్‌ కేసులను తగ్గించడానికి సుప్రీంకోర్టులో సాంకేతికతను ఉపయోగించుకోవడం ప్రారంభించాం. కిందిస్థాయిలో ఇప్పుడున్న న్యాయాధికారుల ఖాళీలను భర్తీచేయాలి. మరిన్ని పోస్టులు సృష్టించాలి. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంటు ప్లీడర్లు, స్టాండింగ్‌ కౌన్సిళ్ల ఖాళీలను వేగంగా భర్తీచేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. కింది కోర్టుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించాలి’’ అని ప్రధానిని కోరారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని