కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆగం

కల్లాల్లో రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఆగం కాలేదని.. నిర్లక్ష్యంతో కేసీఆర్‌ సమస్యను సృష్టించి రాజకీయ లబ్ధి కోసం మరింత

Updated : 29 Nov 2021 04:55 IST

 సమస్యను ఆయనే సృష్టించారు..

వరి వద్దన్నోళ్లు మనకు అవసరమా?

మోదీ, కేసీఆర్‌లను వదిలించుకుందాం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న జానారెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కల్లాల్లో రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఆగం కాలేదని.. నిర్లక్ష్యంతో కేసీఆర్‌ సమస్యను సృష్టించి రాజకీయ లబ్ధి కోసం మరింత జటిలం చేశారని ధ్వజమెత్తారు. రైతులను బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న మోదీ, కేసీఆర్‌లను వదిలించుకోవడానికి ప్రజలు కలసిరావాలన్నారు. వరి ధాన్యం మొత్తం మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో చేపట్టిన రెండు రోజుల ‘వరి దీక్ష’ ఆదివారం ముగిసింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘గత ఏడాది సాగు చేయొద్దని చెప్పినప్పటికీ వరి వేశారని రైతులపై కేసీఆర్‌ కక్ష కట్టారు. కేంద్రం వానాకాలంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నులు కొంటామని చెప్పినా.. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసింది. దిల్లీపై ఇక యుద్ధమే అని చెప్పిన కేసీఆర్‌.. ప్రధాని అపాయింట్‌మెంట్‌ అడగకుండానే వెళ్లి, తెరాస ఎంపీ ఇంట్లో విందు భోజనం చేసి వచ్చారు. చిత్తశుద్ధి ఉంటే అపాయింట్‌మెంట్‌ కోరిన లేఖను బయటపెట్టాలి. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సీఎంకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే తాను వెళ్లకుండా మంత్రులను పంపారు. వరి వద్దంటున్నవారు ప్రత్యామ్నాయ పంటలు చెప్పడం లేదు. వరి వద్దన్నోళ్లు మనకు అవసరమా? రైతు తలచుకుంటే గద్దె ఎక్కించగలడు.. దించగలడు. మోదీ, కేసీఆర్‌లు ఇద్దరూ కలసి రైతులను కట్టుబట్టలతో కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తున్నారు. ఈ సునామీ నుంచి రక్షించుకోవడానికి అందరూ కలిసి రావాలి. సోమవారం గవర్నర్‌ను కలసి వినతిపత్రం ఇస్తాం. మంగళవారం పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తుతాం. డిసెంబరు 9 నుంచి 13 మధ్య దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. కల్లాల్లో అన్నదాతలు చనిపోతుంటే వారిని ఆదుకునే ప్రయత్నం చేయకుండా తెలంగాణ రైతుల సమాధుల మీద గద్దెనెక్కాలని భాజపా చూస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మానవత్వం లేదని దుయ్యబట్టారు.

‘వరి దీక్ష’ ముగింపు సందర్భంగా నినాదాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు

ప్రజలు కోరుకున్నప్పుడే అధికారంలోకి వస్తాం: జానారెడ్డి

జానారెడ్డి మాట్లాడుతూ.. తెరాస, భాజపాలకు అందలం ఎక్కాలనే యావ తప్ప సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదన్నారు. ‘‘అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండి వారి తరఫున ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంది. ప్రజలు కాంగ్రెస్‌ కావాలని కోరుకున్నప్పుడే అధికారంలోకి వస్తాం’’ అని జానారెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాలో కాంగ్రెస్‌ రక్తం ఉంది. చిన్నచిన్న మనస్పర్థలుంటే వాటిని పక్కనపెట్టి పీసీసీ అధ్యక్షుడు అందర్నీ కలుపుకొని పోవాలి. మళ్లీ అధికారంలోకి వస్తాం’’ అని అన్నారు. తెజస అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. ‘‘రైతులు ఏ పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఇది. చేనుకు చీడ పడితే ఏం చేయాలో రైతుకు తెలుసు.. కేసీఆర్‌ను వదిలించుకోవడానికీ వారు సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రైతు సంఘం ప్రతినిధులు హాజరై సంఘీభావం తెలిపారు. కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్కలతోపాటు నాయకులు మహేశ్‌కుమార్‌గౌడ్‌, వీహెచ్‌, పొన్నాల, చిన్నారెడ్డి, కోదండరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

‘వరి దీక్ష’లో తొమ్మిది తీర్మానాలు

‘వరి దీక్ష’లో కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి 9 తీర్మానాలను ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్‌ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ‘వానాకాలం వరి పంట మొత్తం ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి, రైస్‌మిల్లర్ల ప్రమేయం తగ్గించాలి, ఏకకాలంలో లక్ష రుణ మాఫీ చేయాలి’ తదితర తీర్మానాలు అందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని