ఇక తాడో.. పేడో

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఆందోళన బాట పట్టాయి. డిసెంబరు 7 నుంచి జనవరి 6 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి.

Published : 29 Nov 2021 04:04 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల ఆందోళన బాట

ఉద్యమ కార్యాచరణ ప్రకటన

ఈనాడు డిజిటల్‌- అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఆందోళన బాట పట్టాయి. డిసెంబరు 7 నుంచి జనవరి 6 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆర్టీసీ డిపోలు, తాలూకా, డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనలు.. అనంతరం ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించాయి. ప్రభుత్వం స్పందించకపోతే విశాఖపట్నం, తిరుపతి, ఏలూరు, ఒంగోలుల్లో ప్రాంతాలవారీగా సదస్సులు నిర్వహిస్తామని తెలిపాయి. ఇది తొలి దశ ఆందోళన మాత్రమేనని.. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే రెండో దశ మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాయి. ఉద్యమ కార్యాచరణ నోటీసును డిసెంబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇస్తామని వివరించాయి. రెండు నెలలుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ధ్వజమెత్తాయి. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు.

* పీఆర్‌సీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన మాటకే దిక్కు లేకుండా పోయిందని, ఉన్నతాధికారులు చేతులెత్తేశారని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగులపై వివక్ష చూపిస్తోంది. ఒకటో తేదీన వేతనం ఇవ్వలేని పరిస్థితి. ఉద్యోగులకు సంబంధించి రూ.1,600 కోట్ల బకాయిల విడుదలపై ఇప్పటికీ కార్యాచరణ ప్రకటించలేదు. పీఆర్‌సీ నివేదిక ఎప్పుడు ప్రకటిస్తారంటే సమాధానం లేదని విమర్శించారు. ‘ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పాటు అవహేళన చేస్తూ మాలో కొందర్ని కించపరిచేలా మాట్లాడడం బాధ కలిగించింది. నిధుల్ని 90 శాతం ప్రజలకు పంచాలా.. లేక ఉద్యోగులకు ఇవ్వాలా అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడటం మమ్మల్ని కించపరచడమే. వేతనం ఆలస్యమయినా, అనేక ఇబ్బందులున్నా భరించాం. ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదు?’ అని విమర్శించారు.

వారంలోగా పీఆర్‌సీ కొలిక్కి
- ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి 

పీఆర్‌సీ అంశాన్ని వారంలోపు పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగ వ్యవహారాలు) చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వేతన సవరణ అమలుపై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇలా ఉద్యమం

* డిసెంబరు 7- 10: ప్రభుత్వ కార్యాలయాలు, శాఖాధిపతులు, ఆర్టీసీ డిపోలు, పాఠశాలలు, తాలూకా, డివిజన్‌, జిల్లా కేంద్రాల్లోని కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలతో విధులు
10: మధ్యాహ్న సమయంలో నిరసనలు
13: తాలూకా, డివిజన్లలో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు
16: తాలూకా, డివిజన్‌ కేంద్రాలు, ఆర్టీసీ డిపోలు, శాఖాధిపతుల కార్యాలయాల ఎదుట ధర్నా
21: జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ధర్నా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని