వారికి ఎదురు చూపులు.. వీరికి అదనపు బాధ్యతలు

రాష్ట్ర క్యాడర్‌కు చెందిన సీవీ ఆనంద్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లారు. దాదాపు మూడున్నరేళ్లపాటు కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌)లో పనిచేశారు. డిప్యుటేషన్‌ పూర్తికావడంతో గత సెప్టెంబరులో తిరిగి రాష్ట్రానికి వచ్చారు. అదనపు డీజీ స్థాయి హోదా ఉన్న ఆయన ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్నారు. ఇలా చాలామందే ఉన్నారు.

Published : 29 Nov 2021 04:04 IST

పోలీసుశాఖలో విచిత్ర పరిస్థితి

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్ర క్యాడర్‌కు చెందిన సీవీ ఆనంద్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లారు. దాదాపు మూడున్నరేళ్లపాటు కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌)లో పనిచేశారు. డిప్యుటేషన్‌ పూర్తికావడంతో గత సెప్టెంబరులో తిరిగి రాష్ట్రానికి వచ్చారు. అదనపు డీజీ స్థాయి హోదా ఉన్న ఆయన ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్నారు. ఇలా చాలామందే ఉన్నారు.

రాష్ట్ర పోలీసు అకాడమీ సంచాలకులుగా పనిచేస్తున్న వి.వి.శ్రీనివాసరావు పోలీసు నియామక మండలి, క్రీడలు, శిక్షణతోపాటు తెలంగాణ పోలీస్‌ అకాడమీ సంచాలకుడిగా నాలుగు విభాగాల బాధ్యతలు చూస్తున్నారు. ఆయనే కాదు..మరికొందరూ ఇలా అదనపు బాధ్యతల భారాన్ని మోస్తూ వస్తున్నారు.

రాష్ట్ర పోలీసుశాఖలో విచిత్రమైన పరిస్థితికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఒకపక్క ఒక్కో అధికారి మూడు నాలుగు బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..మరోపక్క అనేక మంది ఉన్నతాధికారులు పోస్టింగుల కోసం ఎదురుచూస్తూ వెయిటింగ్‌లో కొనసాగుతున్నారు. ఏళ్ల తరబడి ఐపీఎస్‌ అధికారుల బదిలీలు లేకపోవడంతో పదోన్నతులు పొందినవారు పాత పోస్టుల్లోనే కొనసాగుతుండటం, పదవీ విరమణతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడకపోవడమే దీనికి కారణమనే చర్చ శాఖలో ఉంది. ఉదాహరణకు కరీంనగర్‌ కమిషనర్‌గా పనిచేసిన కమలాసన్‌రెడ్డిని గత జులైలో బదిలీ చేశారు. డీఐజీ హోదాలో ప్రస్తుతం ఆయన వెయిటింగ్‌లో ఉన్నారు. రాష్ట్ర క్యాడర్‌కు చెందిన విక్రమ్‌సింగ్‌మాన్‌ ఐదేళ్లపాటు కేంద్ర సర్వీసులకు వెళ్లి సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేసి రెండు వారాల క్రితం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఐజీ స్థాయి అధికారి అయిన ఆయనా వెయిటింగ్‌లో ఉన్నారు. సూర్యాపేట ఎస్పీ భాస్కరన్‌ను గత అక్టోబరు నెలలో బదిలీ చేశారు. ఆయనా వెయిటింగ్‌ జాబితాలో చేరారు. కేంద్ర నిఘా విభాగంలో పనిచేసి తిరిగి రాష్ట్రానికి వచ్చిన ఐజీ విజయ్‌కుమార్‌కు దాదాపు మూడు నెలల వెయిటింగ్‌ తర్వాత శుక్రవారం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా తాత్కాలిక ఎటాచ్‌మెంట్‌ ఇచ్చారు.

ఇన్ని బాధ్యతల పర్యవేక్షణ సాధ్యమా

ఒకపక్క కొందరు వెయిటింగ్‌లో ఉంటే, ఇంకోపక్క కొంతమంది మూడు నాలుగు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితి దీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఉదాహరణకు అగ్నిమాపకశాఖ డీజీగా పనిచేస్తున్న సంజయ్‌కుమార్‌కు.. జైన్‌ ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. డీజీగా ఉన్న గోవింద్‌ సింగ్‌ సీఐడీలో కొనసాగుతూనే కీలకమైన అవినీతి నిరోధకశాఖ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా పోలీసు కంప్యూటర్‌ సర్వీస్‌, శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్‌ జైళ్లశాఖ డీజీ బాధ్యతలూ చూస్తున్నారు. మరోవైపు ఏళ్లతరబడి బదిలీలు లేకపోవడంతో పదోన్నతులు పొందిన వారు పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఎ.ఆర్‌.శ్రీనివాసరావు, విశ్వప్రసాద్‌, రమేష్‌రెడ్డిలు డీఐజీ హోదా పొందిన తర్వాత కూడా ఎస్పీ స్థాయి పోస్టుల్లోనే పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని