లంచం ఎరవేసినా ఊచలు లెక్కెట్టాల్సిందే

సాధారణంగా అవినీతి కేసుల్లో ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు, సిబ్బందినే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పట్టుకుంటోంది. ప్రభుత్వ అధికారులకు లంచం ఎరవేసిన, ప్రలోభపెట్టిన వారినే కాదు.. అవినీతికి పాల్పడిన

Published : 29 Nov 2021 04:04 IST

తొలిసారిగా తెలుగు అకాడమీ వ్యవహారంలో ఏసీబీ సవరణ చట్టం వర్తింపు

ఎక్కువ వడ్డీ ఆశజూపిన ఇద్దరు బ్యాంకు మేనేజర్లు

ఇద్దరు అకాడమీ ఉద్యోగులపై కూడా..

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా అవినీతి కేసుల్లో ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు, సిబ్బందినే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పట్టుకుంటోంది. ప్రభుత్వ అధికారులకు లంచం ఎరవేసిన, ప్రలోభపెట్టిన వారినే కాదు.. అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధులపైనా కేసులు నమోదు చేస్తోంది. అవినీతి నిరోధక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2018లో సవరించింది. దీని ప్రకారం ప్రభుత్వ నిధులను స్వాహా చేసేందుకు, సర్కారు ఆస్తులకు నష్టం కలిగించేందుకు అధికారులు, సిబ్బందితో సంప్రదింపులు నిర్వహించడం, లంచమిస్తామంటూ ఒప్పందం కుదుర్చుకోవడం నేరం. ఈ చట్టం కింద నిందితుల ఆస్తులనూ జప్తు చేసే అధికారముంది. వాటిని తాము సక్రమంగా సంపాదించామని ఏసీబీ కోర్టుకు నిందితులు ఆధారాలు సమర్పించాకే వెనక్కి తీసుకునే అవకాశముంటుంది. ఇటీవల సంచలనం సృష్టించిన రూ.64.5 కోట్ల తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో సవరించిన చట్టాన్ని తొలిసారిగా వర్తింపజేశారు. తమ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశజూపిన రెండు బ్యాంకుల మేనేజర్లపై, ఆ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని అధికారులను నమ్మించిన ఇద్దరు తెలుగు అకాడమీ ఉద్యోగులపై, డబ్బుల స్వాహాకు సహకరిస్తే కమీషన్‌ ఇస్తామని ప్రలోభానికి గురిచేసిన ప్రధాన నిందితుడు చందువెంకట్‌ సాయికుమార్‌, ఇతర నిందితులపై ఈ చట్టం కింద కేసు నమోదు చేశారు. తద్వారా నిందితులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుంటుంది.

వారిపైనా దృష్టి..

సర్పంచులు, ఉపసర్పంచులు సహా మండల, నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే అరెస్ట్‌ చేసేందుకు ఏసీబీ అధికారులకు చట్టబద్ధమైన అధికారం ఉంది. సర్పంచులు, ఉప సర్పంచులను అరెస్ట్‌ చేసి.. జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందిస్తే సస్పెండ్‌ చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు, హెచ్‌ఎండీఏ పరిధిలోకి రాని గ్రామాల్లో ఇటీవల వెలుస్తున్న రియల్‌ వెంచర్లకు అనుమతులు ఇచ్చేందుకు కొందరు సర్పంచులు, ఉపసర్పంచులు లంచం డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అవినీతికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధులపై ఏసీబీ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్‌ శివారులోని ఇద్దరు సర్పంచులు, ఒక ఉపసర్పంచి, ఆమె భర్తను ఇటీవల అరెస్ట్‌ సైతం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని