పథకాలతో జీవనశైలి మారాలి

ప్రజాసేవ కోసమే పదవులు తప్ప, అధికారం చలాయించడానికి కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను సేవ చేయాలని కోరుకుంటున్నానే తప్ప, అధికారాన్ని కాదని అన్నారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’

Updated : 29 Nov 2021 05:25 IST

 మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

దిల్లీ: ప్రజాసేవ కోసమే పదవులు తప్ప, అధికారం చలాయించడానికి కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను సేవ చేయాలని కోరుకుంటున్నానే తప్ప, అధికారాన్ని కాదని అన్నారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ లబ్ధిదారుడు మోదీ అధికారంలో కొనసాగాలంటూ ఆకాంక్షించారు. దీనిపై స్పందిస్తూ ‘‘నేను ఈ రోజు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా ఉండాలని అనుకోవడం లేదు. సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నా. ప్రధాని పదవి అధికారం కోసం కాదు. సేవ చేయడం కోసమే’’ అని చెప్పారు. ప్రభుత్వ పథకాల కారణంగా జీవన విధానం మారితే అది చాలా సంతోషం కలిగిస్తుందని అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌తో తమ జీవితాలు మారాయని లబ్ధిదారులు ప్రధానికి వివరించారు.

మూడు అంశాల్లో విజృంభిస్తున్న యువత

దేశంలోని యువత అందిస్తున్న సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూడు అంశాలు....‘నవీన ఆవిష్కరణలు’, ‘రిస్కు తీసుకోవడంపై అనురక్తి’, ‘చేయగలమన్న విశ్వాసం’ వారిలో కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ మూడు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం అంతా అంకుర సంస్థలు (స్టార్ట్‌ అప్స్‌) గురించే మాట్లాడుతున్నారని, వీటికి భారత దేశం కేంద్ర స్థానంగా మారిందని తెలిపారు. ఏటా కొత్త అంకుర సంస్థలు వస్తున్నాయని, ఈ రంగం శీఘ్రంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. చిన్న పట్టణాల్లోనూ వీటిని నెలకొల్పుతున్నారని అన్నారు. 70కుపైగా అంకుర సంస్థల విలువ ఒక బిలియన్‌ డాలర్ల (రూ.7వేల కోట్లు)కు దాటిందని చెప్పారు. ‘‘ఇది గొప్ప విషయం. కరోనా ఉన్నప్పటికీ దేశ యువత ఈ విజయాన్ని సాధించారు. అంకుర సంస్థల ద్వారా ప్రపంచ సమస్యలకు కూడా వారు పరిష్కారం చూపుతున్నారు’’ అని ప్రశంసించారు. అంకుర సంస్థలు విజయం సాధిస్తుండడంతో దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. బస్సుల కాలుష్యాన్ని 40 శాతం మేర తగ్గించడానికి అంకుర సంస్థలను నెలకొల్పిన మయూర్‌ పాటిల్‌ అనే యువకునితో ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.90 లక్షల సాయంతో ఆయన ఆ సంస్థను ఏర్పాటు చేశాడు.

సాహసాలకు యుద్ధభూమే అవసరం లేదు

సాహసం చూపించడానికి యుద్ధభూమే అవసరం లేదని, అభివృధ్ధి కార్యక్రమాల్లోనూ వాటిని ప్రదర్శించవచ్చని ప్రధాని మోదీ అన్నారు. బుందేల్‌ఖండ్‌లోని జలౌన్‌ ప్రాంత వాసులు ఎంతో శ్రమించి నూన్‌ నదిని పునరుద్ధరించారని చెప్పారు. తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో ఒక నది ప్రవహించేలా చేశారని తెలిపారు. మేఘాలయలో స్థానికులే ఓ నది నీటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారని గుర్తుచేశారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధాని మోదీ దేశవాసులను హెచ్చరించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అందరి బాధ్యత అంటూ అప్రమత్తం చేశారు. 

ఆడియో, సంగీతం ప్లాట్‌ఫారాల్లో అందుబాటు

మన్‌ కీ బాత్‌ కేవలం రేడియా, టీవీ, యూట్యూబ్‌, నమో యాప్‌ ద్వారా మాత్రమే కాకుండా ఇకపై ఆడియో, మ్యూజిక్‌ ప్లాట్‌ఫారాల్లోనూ అందుబాటులోకి రానుంది. హంగామా, గానా, అమెజాన్‌ మ్యూజిక్‌, జియోసావన్‌, స్పోటిఫై, వింక్‌ వంటి ప్లాట్‌ఫారాల ద్వారా కూడా ప్రసారం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని