కృష్ణాజలాలు గుప్పిట పడుతున్న కర్ణాటక

కర్ణాటక మొత్తం నీరు గుప్పిట పడుతోందని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకే రాని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయనే ఆ రాష్ట్ర వాదన అసంబద్ధమని తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.ఎస్‌.వైద్యనాథన్‌ సర్వోన్నత ...

Published : 30 Nov 2021 04:56 IST

సముద్రంలో కలుస్తున్నాయడం అసంబద్ధం
సుప్రీంకోర్టులో తెలంగాణ వాదన

ఈనాడు, దిల్లీ: కర్ణాటక మొత్తం నీరు గుప్పిట పడుతోందని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకే రాని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయనే ఆ రాష్ట్ర వాదన అసంబద్ధమని తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.ఎస్‌.వైద్యనాథన్‌ సర్వోన్నత న్యాయస్థానంలో వాదించారు. ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు అనుమతిస్తూ కృష్ణా ట్రైబ్యునల్‌-2 అవార్డు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ అవార్డును అమలు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ (ఐఏ) దాఖలు చేసింది. జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టింది. తొలుత వైద్యనాథన్‌ వాదనలు వినిపిస్తూ... ‘‘2007 నుంచి ఎంత నీరు వినియోగించారు, ఎంత మళ్లించారనే దానిపై గణాంకాలు ఇవ్వాలని మేం కోరుతున్నా కర్ణాటక పట్టించుకోవడం లేదు’’ అన్నారు. కేంద్ర తరఫు సీనియర్‌ న్యాయవాది వాసిం ఖాద్రీ తమ స్పందన సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరగా న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేశారు. గతంలో కూడా సమయం తీసుకున్నారని గుర్తుచేశారు. కర్ణాటక తరఫు న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ మాట్లాడుతూ ‘‘ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ఒరిజినల్‌ పిటిషన్‌ విచారణ కోసం ఈ ఐఏను వాయిదా వేయడం సరికాదు. గత ఏడేళ్లలో 130 టీఎంసీల వినియోగించుకునేందుకు వీలుగా కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ, భూ సేకరణ, పరిహారం, పునరావాసాలకు రూ. 13,321 కోట్లు వ్యయం చేశాం. నీళ్ల కోసం రైతులు ఒత్తిడి పెంచుతున్నారు. నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నందున త్వరగా విచారణ ముగించండి’’ అని కోరారు. తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘కర్ణాటక నుంచి నీరు శ్రీశైలానికే రానప్పుడు సముద్రంలోకి వెళతాయని ఎలా చెబుతారు? కర్ణాటక మొత్తం నీరు గుప్పిట పడుతోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా నీరు సముద్రంలో కలుస్తుందని ఎలా చెబుతారు?’’ అని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం డిసెంబరు 13కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని