అమరావతి అభివృద్ధికి అడ్డంకి కాదు

ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి గతంలో ఇచ్చిన యథాతథ స్థితి (స్టేటస్‌ కో)

Published : 30 Nov 2021 04:56 IST

యథాతథ స్థితి ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు  
కార్యాలయాల తరలింపు నిలిపివేత ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని స్పష్టం

ఈనాడు, అమరావతి: ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి గతంలో ఇచ్చిన యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులు అడ్డంకి కాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్ట నిబంధనల మేరకు అభివృద్ధి కొనసాగించవచ్చని పేర్కొంది. స్టేటస్‌కో కారణంగా అమరావతిలో అభివృద్ధి నిలిచిపోవడాన్ని తాము కోరుకోవడం లేదని తెలిపింది. ప్రభుత్వ పాలనను తాము చేయాలనుకోవడం లేదని, వారి ప్రతి నిర్ణయాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపు, ఇళ్ల స్థలాల కేటాయింపును నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని తేల్చిచెప్పింది. సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను ‘రద్దు’ చేస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లుకు గవర్నర్‌ సమ్మతి తెలపాల్సి ఉందని, ఆయన అనారోగ్యంతో ఉన్నారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం కోసం ఈ నెల 25న బిల్లును గవర్నర్‌కు పంపించామన్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతోంది, హైకోర్టు వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలు తదితర వివరాలతో కోర్టు ముందు మెమో దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలన్నారు. దీంతో విచారణను డిసెంబర్‌ 27కు వాయిదా వేస్తూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.

సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దుపై పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అఫిడవిట్‌ దాఖలు చేశారు. బిల్లులు ఈ నెల 22న శాసనసభ, 23న శాసనమండలి ఆమోదించాయని పేర్కొన్నారు. సోమవారం ఈ వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి.

విచారణ కొనసాగించాలన్న పిటిషనర్లు
రాజధాని రైతు పరిరక్షణ సమితి, తదితరుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌, పీబీ సురేశ్‌ వాదనలు వినిపిస్తూ.. బిల్లు ఇంకా చట్టం కాలేదన్నారు. గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు పెడుతున్నాం అంటూనే.. మరోవైపు మూడు రాజధానుల కోసం బిల్లు తెస్తామని చెబుతోందన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది తమ వాదన అన్నారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యాల్లో అభ్యర్థించామన్నారు. వాటిపై విచారణను కొనసాగించాలని కోరారు. సీజే స్పందిస్తూ.. సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ ఇటీవల వాదనలు వినిపిస్తూ రాజధాని అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్‌ సిటీగా మార్చిందన్నారని గుర్తుచేశారు. ఈ వ్యాజ్యాలను అపరిష్కృతంగా ఉంచితే అవి కూడా ‘ఘోస్ట్‌ పిటిషన్లు’గా మారతాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చట్టాలు చేయకుండా నిషేధ ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని విచారిస్తామని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని