ఏఐబీపీ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి: కేంద్రం

సత్వర సాగునీటి ప్రయోజన పథకం(పీఎంకేఎస్‌వై- ఏఐబీపీ) కింద రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎనిమిది ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సోమవారం సాయంత్రం రాష్ట్ర ...

Updated : 30 Nov 2021 04:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: సత్వర సాగునీటి ప్రయోజన పథకం(పీఎంకేఎస్‌వై- ఏఐబీపీ) కింద రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎనిమిది ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సోమవారం సాయంత్రం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌లతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. దేవాదుల, పాలెంవాగు, పెద్దవాగు, నీల్వాయి, బీమా-2, కుమురం భీం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ-2, ఇందిరమ్మ వరద కాలువల పనులు, నిధుల వినియోగంపై సమీక్షించారు. ఇప్పటికే 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని రాష్ట్ర అధికారులు వివరించినట్లు సమాచారం.

ఆయకట్టుకు నీరందించే డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ పనులు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. ఏఐబీపీ పథకం రెండో దశలో మరికొన్ని ప్రాజెక్టులకు అవకాశం కల్పించే విషయమై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఇందుకు ప్రాజెక్టుల వివరాలను సమర్పించాలని కేంద్రం సూచించినట్లు సమాచారం.


ఏఐబీపీ గ్రాంటుకు కాళేశ్వరం ఆయకట్టు ప్రతిపాదనలు!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇంకా పూర్తికాని ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణాలు, స్ట్రక్చర్ల నిర్మాణాలను ఏఐబీపీ కింద ప్రతిపాదించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ దస్త్రాలు సిద్ధం చేసినట్లు తెలిసింది. జలాశయాల కింద మిగిలి ఉన్న పనుల అంచనాలు, కావాల్సిన నిధుల వివరాలను సిద్ధం చేసి కేంద్ర జల్‌శక్తి శాఖకు సమర్పించేందుకు సీఈల నుంచి ఈఎన్‌సీ హరిరాం ప్రతిపాదనలు తీసుకున్నట్లు తెలిసింది. వీటికి ఆమోదం లభిస్తే గ్రాంటు రూపంలో వచ్చే నిధులతో మిగిలిన పనులన్నీ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని