Updated : 01/12/2021 04:25 IST

పరిహారం.. దూరం

కొవిడ్‌ మృతుల కుటుంబాల్లో అయోమయం
అనేక మంది వద్ద ఆధార పత్రాలూ లేని వైనం


ఈమె పేరు ఆర్‌.లక్ష్మి. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి.. గతేడాది ఆగస్టు మూడున ఆమె భర్త కరోనా కాటుకు బలయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందినా ప్రాణం దక్కలేదు. ప్రస్తుతం లక్ష్మి భోజనశాల నడుపుతూ తన ఇద్దరు చిన్నారులనూ పోషిస్తోంది. భర్త చికిత్సకు సంబంధించిన దస్త్రాలేవీ ఇప్పుడు ఆమె వద్ద లేవు. ‘నా భర్తే మా ఇంటికి దిక్కు. ఆయన పోయిన బాధలో ఉండగానే చికిత్సకు చెందిన దస్త్రాలు పోయాయి. మాకు సాయం చేయండి.’ అంటూ ఆమె వేడుకుంటోంది.


ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్‌ పరిహారం పొందడానికి జిల్లాల్లో దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు దరఖాస్తుదారుల్లో అయోమయమూ ఉంది. గతేడాది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతూ మృతిచెందిన అనేక మంది కొవిడ్‌ మృతి ధ్రువీకరణ పత్రం తీసుకోలేదు. పైగా చాలా జిల్లాల్లో బాధిత కుటుంబాల్లో సరైన ఆధార పత్రాలేవీ లేవు. కరోనా పరీక్ష అనంతరం బాధితుడి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం వచ్చినా ఇప్పుడవి వారి వద్ద లేవు. కొవిడ్‌ మృతులకు ప్రభుత్వం రూ.50వేల పరిహారం పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బాధితులు రికార్డుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం నాటికి నిజామాబాద్‌ జిల్లాలో 650, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో 1400 దరఖాస్తులు అందాయి.

కరోనా మొదటి విడతలో ఎవరికైనా పాజిటివ్‌ అని తేలినా బయటకు చెప్పుకోవడానికీ భయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందినా నివాస ప్రాంతాల్లో గోప్యత పాటించారు. కుటుంబంలో ఒకరికి కరోనా వచ్చిందంటే మిగిలిన వారికీ  సోకి ఉంటుందనే భయంతో వారిని ఇరుగుపొరుగు దూరం పెట్టారు. కొంతమంది ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొంది మరణిస్తే భౌతికకాయాలతో పాటు వారి వస్తువులనూ అటునుంచి అటే తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ క్రమంలో కొవిడ్‌ మృతిగా నమోదుకు సైతం చాలామంది వెనక్కుతగ్గారు. ఆసుపత్రుల రికార్డుల్లో ఈ మేరకు నమోదు చేయకుండా ఉంటే ఇప్పుడు పరిహారం అందడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం(డీఎంఏ) ప్రకారం కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఏర్పాటుచేసిన జిల్లా కమిటీ మృతిని నిర్ధారించాల్సి ఉంది. జనన, మరణాల రిజిస్ట్రార్‌ వద్ద కూడా సదరు మరణానికి సంబంధించిన పరిశీలన చేయాల్సి ఉంది. దీంతో కొవిడ్‌ మృతిగా నమోదుకాకుంటే పరిహారం మంజూరుకు ఉన్న అవకాశాలు తగ్గిపోతాయని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. దరఖాస్తుల పరిశీలనకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని