మావోయిస్టు పార్టీ నుంచి కోబాడ్‌ గాంధీ బహిష్కరణ

మావోయిస్టు పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన కోబాడ్‌ గాంధీని ఆ పార్టీ బహిష్కరించింది. పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట ఈ మేరకు ప్రకటన విడుదలైంది. కోబాడ్‌ రాసిన ‘ప్రాక్చర్డ్‌ ఫ్రీడం- ఎ ప్రిజన్‌ మెమోయిర్‌’ పుస్తకంలోని అంశాలు పార్టీ నియామవళికి విరుద్ధంగా, ప్రతిష్ఠను

Published : 01 Dec 2021 04:44 IST

అధికార ప్రతినిధి అభయ్‌ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన కోబాడ్‌ గాంధీని ఆ పార్టీ బహిష్కరించింది. పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట ఈ మేరకు ప్రకటన విడుదలైంది. కోబాడ్‌ రాసిన ‘ప్రాక్చర్డ్‌ ఫ్రీడం- ఎ ప్రిజన్‌ మెమోయిర్‌’ పుస్తకంలోని అంశాలు పార్టీ నియామవళికి విరుద్ధంగా, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పార్టీ తరఫున విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పుస్తకంలో చర్చించిన అంశాలను బట్టి కోబాడ్‌ మార్క్సిస్ట్‌ మూలసూత్రాలను, వర్గపోరాటాన్ని, గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని విస్మరించి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోందన్నారు. 2009లో అరెస్టయి జైలుకు వెళ్లిన కోబాడ్‌.. పదేళ్లకు విడుదలైన తర్వాత తాను మావోయిస్టు పార్టీలో సభ్యుడిని కాదని చెబుతూ వచ్చారన్నారు. విప్లవ పార్టీలో అత్యున్నత స్థాయిలో పనిచేసి అరెస్ట్‌ కాగానే వాస్తవాలను మరుగుపరిచి పాలకవర్గాల మెప్పు కోసం పాకులాడటాన్ని బట్టే ఆయన నిజాయతీని కోల్పోయారని తెలుస్తోందని ప్రకటనలో విమర్శించారు. కోబాడ్‌ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత పార్టీని సంప్రదించకుండా, చర్చించకుండానే పార్టీ సైద్ధాంతిక రాజకీయాలకు వ్యతిరేకంగా పుస్తకాన్ని రాసి ప్రచురించడం అతడిలోని అనార్కిస్టు ధోరణులను బయటపెడుతోందన్నారు.

లండన్‌లో చదువుతూనే విప్లవ భావజాలానికి ఆకర్షణ
ముంబయికి చెందిన కోబాడ్‌ గాంధీ సీఏ కోర్సు కోసం లండన్‌ వెళ్లి.. అక్కడే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. 2007లో మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2009లో దిల్లీలో కేన్సర్‌ చికిత్స తీసుకుంటున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. 2019లో జైలు నుంచి విడుదలయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని