‘ఒమిక్రాన్‌’పై ఆందోళన వద్దు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. కొవిడ్‌పై వదంతులతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని.. సరైన సమాచారాన్ని, సూచనలను ఎప్పటికప్పుడు అందించడమే ఇందుకు పరిష్కార మార్గమని

Updated : 02 Dec 2021 04:12 IST

 కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పునరుద్ధరణ

 మంత్రులు హరీశ్‌రావు,కేటీఆర్‌, సబితారెడ్డి

కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్షలో మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్‌ హరీశ్‌రావు, సభ్యులు కేటీఆర్‌, సబితారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. కొవిడ్‌పై వదంతులతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని.. సరైన సమాచారాన్ని, సూచనలను ఎప్పటికప్పుడు అందించడమే ఇందుకు పరిష్కార మార్గమని చెప్పింది. గతంలో ఏర్పాటైన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పునరుద్ధరించి.. 24/7 విధానంలో పనిచేయించాలని నిర్ణయించింది. టీకాలు వేసుకోవడంతోపాటు ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో 100% రెండు డోసుల టీకాల కార్యక్రమం పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్లకు సూచించింది. వైద్య, ఆరోగ్య, పురపాలక, విద్య, పంచాయతీరాజ్‌ సహా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరాలని మార్గనిర్దేశం చేసింది. కరోనా మూడో దశ ముప్పుపై వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధత కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్‌ హరీశ్‌రావు, సభ్యులైన పురపాలక, విద్యా శాఖల మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డిలు బుధవారం కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ‘‘వంద శాతం టీకాల లక్ష్యాన్ని  సాధించేందుకు ఆవాసాలు, వార్డులు, ఉపకేంద్రాలు, పురపాలికలు, మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. కరోనాపై సామాజిక మాధ్యమాల్లో జరిగే తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి.

పడకలపై సమాచారం..

రాష్ట్ర స్థాయితోపాటు జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లో పడకలపై ప్రజలకు సమాచారం అందించాలి. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో కరోనా నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యాసంస్థల్లో టీకా శిబిరాలు ఏర్పాటు చేసి 100% లక్ష్యాలను సాధించాలి. బోధన, బోధనేతర సిబ్బందికి సైతం పూర్తిస్థాయిలో టీకాలివ్వాలి. ఏరియా ఆసుపత్రుల ఉన్నతీకరణ, రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, ఆర్‌టీపీసీఆర్‌ సెంటర్ల ఏర్పాటుకు అనువైన వసతులు, స్థలాలు కేటాయించాలి’’ అని ఆదేశించారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని