Published : 02/12/2021 04:29 IST

సస్పెన్షన్‌పై ససేమిరా

  వేటును తప్పుపట్టిన పార్టీలు

  సబబే: వెంకయ్యనాయుడు  

  స్తంభించిన రాజ్యసభ

రాజ్యసభ నిర్వహణలో అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు

దిల్లీ: మునుపటి సమావేశాల్లో ప్రవర్తించిన తీరుకు గానూ 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేయడాన్ని నిరసిస్తూ వివిధ పార్టీల సభ్యులు బుధవారం రాజ్యసభను స్తంభింపజేశారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ వారు నినాదాలిచ్చి, సభాపతి స్థానం వద్ద నిరసన వ్యక్తంచేశారు. పవిత్రమైన సభను, పార్లమెంటరీ వ్యవస్థను అవమానపరిచి, ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయని సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేసే ప్రశ్నే లేదని ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. జలాశయాల భద్రత బిల్లును ప్రవేశపెట్టడానికి జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రయత్నించినా సభ్యులు ఆయన ప్రసంగానికి అడుగడుగునా అడ్డుపడ్డారు. తర్వాత సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్‌ కాలితా పలుమార్లు విజ్ఞప్తి చేసినా తమతమ స్థానాల్లోకి వెళ్లడానికి విపక్ష సభ్యులు నిరాకరించారు. ఒకసారి వాయిదా పడి సభ తిరిగి మొదలయ్యాక డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ మాట్లాడుతూ.. సభ్యులంతా ప్రశాంతంగా ఉంటే విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు అనుమతిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి షెకావత్‌ని అడ్డుకోవడం ప్రజలకు సానుకూల సంకేతాలను పంపడం లేదని, ఇది మంచిది కాదని చెప్పారు. బిల్లుపై కాకుండా సభ్యుల సస్పెన్షన్‌పై ఖర్గేను మాట్లాడనివ్వాలని విపక్షాలు పట్టుపట్టాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని ముందుకు సాగనివ్వకుండా నిరసనలు కొనసాగించాయి. విపక్షాలు తమ పట్టు సడలించకపోవడంతో సభ గురువారానికి వాయిదా పడింది. అటు లోక్‌సభలో తెరాస సభ్యుల నిరసనలతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రైతుల అంశాలపై వారంతా ప్రశ్నోత్తరాల సమయంలో గళమెత్తారు. వారి నిరసనల మధ్యే అరగంటసేపు ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించి, ఆ తర్వాత వాయిదా వేశారు. ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ విపక్ష సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా దీనిలో పాల్గొన్నారు. సస్పెన్షన్‌కు గురైనవారు ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు అదేచోట ప్రతిరోజూ నిరసనలు కొనసాగించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వారు, ఉదయం 10 నుంచి 11 వరకు ఇతర విపక్ష ఎంపీలు నిరసనలు చేపట్టనున్నారు.

నిరసన కొనసాగిస్తున్న విపక్ష నేతలతో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

రైతుల మరణాలపై సమాచారం లేదు
సాయం చేయలేం: తోమర్‌
సాగు చట్టాలపై ఆందోళనల్లో మరణించిన రైతుల గురించి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పార్లమెంటుకు తెలిపారు. అలాంటప్పుడు సాయం అనే దానికి తావు లేదని స్పష్టంచేశారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. రైతు మరణాలు, నిరసనల వల్ల ప్రభావితమైన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, కేసుల ఉపసంహరణపై విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై తోమర్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ ఇది రైతులకు అవమానకరమన్నారు. నిరసనల్లో 700 మంది రైతులు చనిపోయారని, సమాచారం లేదని కేంద్రం అలా ఎలా చెబుతుందని మండిపడ్డారు.


సాగు చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

దిల్లీ: వివాదాస్పదమైన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం సంతకం చేశారు అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిని నోటిఫై చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైన మొదటిరోజే ఉభయ సభలు ఈ రద్దు బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని