Published : 02/12/2021 04:55 IST

నీరుగప్పిన నిర్లక్ష్యం

  శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులను పట్టించుకోని అధికారులు

నిపుణుల కమిటీల నివేదికలన్నీ కాగితాల్లోనే భద్రం

  తాము తీసుకున్నాక ఎలా అని కృష్ణాబోర్డు తర్జనభర్జన 

  ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం

వరద ఉద్ధృతి సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు

ఈనాడు హైదరాబాద్‌: శ్రీశైలం.. కృష్ణా నదిపై ప్రధాన ప్రాజెక్టు. రెండు తెలుగు రాష్ట్రాలకూ చాలా కీలకమైనది. కాలక్రమేణా వరద ప్రవాహానికి ఇది దెబ్బతింటోంది. స్పిల్‌వే గేట్ల నుంచి విడుదల చేసినపుడు నీరు కిందికి దుమికి ఎగిరి పడేచోట (ప్లంజ్‌పూల్‌) 40 మీటర్ల లోతు గుంత పడింది. దీనిని కాంక్రీటుతో పూడ్చాలి. దీంతోపాటు మరిన్ని పనులు తక్షణం చేయాల్సిన అవసరం ఉందని డిజైన్స్‌ నిపుణుల కమిటీ సిఫార్సు చేసి ఏడాదిన్నర దాటింది. రూ. 722 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనా వేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా అతీగతీ లేదు. డ్యాం భద్రతతో సహా మరిన్ని అంశాలపై పుణెలోని సెంట్రల్‌ పవర్‌ అండ్‌ వాటర్‌ రీసెర్చి (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) సంస్థతో అధ్యయనం చేయించాలి. ఇలాంటివన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టులను తమ అధీనంలోకి తెచ్చుకొనే ప్రక్రియలో కృష్ణా బోర్డు అధికారులు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. డ్యాం భద్రతపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, సిఫార్సుల అమలు జరగకపోవడంతో ప్రస్తుత వాస్తవ పరిస్థితిని రికార్డు చేసినట్లు తెలిసింది.

నేపథ్యం ఇదీ..

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి డిజైన్‌ చేసినప్పుడు ఎప్పుడైనా ఒకసారి 19 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా వేశారు. స్పిల్‌వే నుంచి 13.2 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలేలా 12 గేట్లను అమర్చారు. 2006లో కేంద్ర జలసంఘం సూచన మేరకు గరిష్ఠ వరద ప్రవాహంపై అధ్యయనం చేయగా, 26.5 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తేలింది. 2009లోనే 25.5 లక్షల క్యూసెక్కులు వచ్చింది. ఈ సమయంలో స్పిల్‌వే నుంచి 14 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని వదిలారు. దీంతో నీరు కిందకు వచ్చి ఎగిసి పడేచోట పెద్ద గుంత పడింది. అంతకుముందు పడిన చిన్న గుంతను కాంక్రీటుతో పూడ్చివేయగా, అది కూడా లేచిపోయింది. సుమారు 40 మీటర్ల లోతు గుంత పడటం.. అది ఎప్పటికప్పుడు విస్తరించే అవకాశం ఉండటంతో అధ్యయనం చేయించారు. ప్రస్తుతానికి డ్యాం పునాదుల వైపు రాకపోయినా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చన్న ఆందోళన ఇంజినీర్లలో ఉంది. ఆరు నుంచి ఎనిమిదో గేటు వరకు, 10 నుంచి 16వ సిలిండర్ల వరకు ఎక్కువ నష్టం జరిగినట్లు గుర్తించారు. 

అతీగతీ లేని సిఫార్సులు

శ్రీశైలం డ్యాం భద్రతపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2017లో నివేదిక ఇచ్చింది. ప్లంజ్‌పూల్‌ ప్రాంతంలో బాతీమెట్రిక్‌ సర్వే, నీటి లోపల సిలిండర్లు, ఆప్రాన్‌ గురించి తెలుసుకొనేందుకు వీడియోగ్రఫీ, గేట్ల నిర్వహణలో మార్పులు, పూడికపై అధ్యయనం, వచ్చే వరదను తట్టుకొనేందుకు ముందుగానే నీటిని ఖాళీ చేయడం,  అదనపు స్పిల్‌వే ఏర్పాటు మొదలైన సిఫార్సులు చేశారు. వాటిలో కొన్నే అమలయ్యాయి. వరద నీటిని పక్కనున్న కుందూ నదికి మళ్లించడం, డ్యాంను పటిష్ఠం చేయడం, ఎత్తు పెంచడం ఇలా అనేక అంశాలపై చర్చ జరగడం తప్ప ఏదీ ముందుకెళ్లలేదు. డ్యాంకు ఎడమవైపు పైభాగంలో ఐదో కిలోమీటరు వద్ద అదనపు స్పిల్‌వే ఏర్పాటుకు అనువైన ప్రాంతంపైనా చర్చ జరిగింది కానీ కార్యాచరణ జరగలేదు. మళ్లీ పాండ్యా ఛైర్మన్‌గా కొత్త కమిటీ వేశారు. ఈ కమిటీ 2020 మార్చిలో నివేదిక ఇచ్చింది. 12, 13, 14వ బ్లాకుల వద్ద డ్యాం భద్రతపై అధ్యయనం చేయించడం, ప్లంజ్‌పూల్‌లో పడిన గుంత విస్తరించకుండా చర్య తీసుకోవడం సహా 15 సిఫార్సులు చేసింది. ఈ పనులన్నీ చేయడానికి సంబంధిత ఇంజినీర్లు అంచనా తయారు చేయడం తప్ప పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. ఇప్పుడు కృష్ణా బోర్డు ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని