అయినా వైద్యం భారమే!

ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా.. వైద్య ఖర్చులు పేద, మధ్య తరగతి వర్గాలకు మోయలేని భారంగానే ఉంటున్నాయి. మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 2014-15తో పోలిస్తే 2017-18 నాటికి 17.5 శాతం ...

Updated : 04 Dec 2021 06:14 IST

39.8 శాతానికి పెరిగిన రాష్ట్ర ప్రభుత్వ వ్యయం
49.7శాతం వెచ్చిస్తున్న ప్రజలు
ప్రజల తలసరి సొంత ఖర్చు రూ.2,120గా నమోదు
2017-18 జాతీయ ఆరోగ్య వ్యయ నివేదిక వెల్లడి

ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా.. వైద్య ఖర్చులు పేద, మధ్య తరగతి వర్గాలకు మోయలేని భారంగానే ఉంటున్నాయి. మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 2014-15తో పోలిస్తే 2017-18 నాటికి 17.5 శాతం పెరిగి 39.8 శాతానికి చేరినట్లు జాతీయ ఆరోగ్య వ్యయ నివేదిక తాజాగా వెల్లడించింది. అదే సమయంలో మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజల సొంత ఖర్చు శాతం కూడా 62.1 నుంచి 49.7కి (రూ.2,834 నుంచి 2,120కి) తగ్గింది. వైద్య వ్యయంలో సర్కారు వాటా గణనీయంగా పెరగడం ఆహ్వానించదగిన పరిణామమే అయినా.. సగం కూడా లేకపోవడం.. ప్రజలే దాదాపు సగం భరించాల్సి రావడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. సర్కారు వైద్యంలో ఉచిత చికిత్స పొందినా.. ఔషధాలు బయట కొనుగోలు చేయాల్సి రావడం, నిర్ధారణ పరీక్షలను ప్రైవేటు కేంద్రాల్లో చేయించాల్సి వస్తుండడంతో.. అంతకుమించి రోగి జేబులోంచి ఖర్చవుతోంది. ఇక ప్రైవేటులోకెళ్తే అడ్డగోలు పరీక్షలు, ఇష్టానుసార ధరలతో రోగి ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి కుంగదీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య వ్యయంలో సర్కారు వాటాను పెంచడంతో పాటు.. ఉచిత ఔషధాలు, నిర్ధారణ పరీక్షలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.  

రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కోసం కేసీఆర్‌ కిట్‌ పథకం కింద ప్రోత్సాహక నగదు ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ పథకం కింద ఉచిత నిర్ధారణ పరీక్షలను హైదరాబాద్‌లో అమలు చేయడం, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో కొత్త వైద్యకళాశాలలు రావడంతో స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రావడం తదితర అభివృద్ధి కార్యక్రమాలతో 2014-15తో పోలిస్తే 2017-18 నాటికి ప్రజలకు కొంత మేరకు ఆర్థిక భారం తప్పిందని వైద్యవర్గాలు విశ్లేషించాయి.


తలసరి ఖర్చులో కేరళదే మొదటిస్థానం

* మొత్తం ఆరోగ్య వ్యయంలో తలసరి ఖర్చు అత్యధికంగా కేరళలో రూ.9,264 నమోదు కాగా.. ఇందులో ప్రజలు చేస్తున్న ఖర్చు రూ.6,363, ప్రభుత్వ ఖర్చు రూ.2,272గా తేలింది.

* హిమాచల్‌ప్రదేశ్‌లో తలసరి వ్యయం రూ.6,541 కాగా.. ప్రజలు రూ.3,220, ప్రభుత్వం రూ.3,177 ఖర్చు చేస్తున్నారు.

* పశ్చిమబెంగాల్‌లో ఈ వ్యయం రూ.4,460 కాగా.. ప్రజలు రూ.3,115 భరిస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,628 వ్యయం అవుతుండగా.. ఇందులో ప్రభుత్వం రూ.1,381, ప్రజలు రూ.3,102 చొప్పున భరిస్తున్నారు.


- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు