కొత్త వైద్య కళాశాలల కోసం తెలంగాణ నుంచి ప్రతిపాదనలు రాలేదు

కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకోసం తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Published : 04 Dec 2021 05:18 IST

కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకోసం తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘‘ప్రస్తుతం తెలంగాణలో 5,240 ఎంబీబీఎస్‌, 2,237 పీజీ సీట్ల సామర్థ్యంతో 35 వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో 12 ప్రభుత్వ, 25 ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా, రెఫరల్‌ ఆసుపత్రులకు అనుబంధంగా కొత్తగా వైద్యకళాశాలల ఏర్పాటుకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ కేంద్ర ప్రాయోజిత పథకాన్ని తీసుకొచ్చింది. దీనికింద కళాశాలల ఏర్పాటుకోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదు. ఈ పథకం మూడోదశ కింద వివిధ రాష్ట్రాలకు ఇప్పటికే 75 వైద్య కళాశాలలు మంజూరుచేశాం. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద బీబీనగర్‌లో రూ.1,028 కోట్లతో ఎయిమ్స్‌ ఏర్పాటుకు 2018 డిసెంబర్‌ 12న ఆమోదముద్ర వేశాం. ఈ ప్రాజెక్టు 2024కల్లా పూర్తవుతుంది’’ అని కేంద్రమంత్రి తెలిపారు.

ఆల్‌ ఇండియా జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ కోసం సంప్రదింపులు
ఆల్‌ ఇండియా జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ ఏర్పాటు అంశంపై భాగస్వాముల నుంచి విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏకాభిప్రాయ సాధన కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రీజీజూ చెప్పారు. తెరాస ఎంపీలు మాలాత్‌ కవిత, జి.రంజిత్‌రెడ్డి, వెంకటేష్‌ నేత, పసునూరి దయాకర్‌లకు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 312(1)ను అనుసరించి ఈ వ్యవస్థకు రూపకల్పన చేసిందని, న్యాయవ్యవస్థ బలోపేతానికి ఇది ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మెరిట్‌ జాబితా ప్రకారం తాజా న్యాయశాస్త్ర విద్యార్థులను న్యాయాధికారులుగా ఎంపికచేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.

తెలంగాణలో 23, ఏపీలో 19 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ
తెలంగాణ హైకోర్టులో 23, ఏపీ హైకోర్టులో 19 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు న్యాయశాఖ మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘తెలంగాణ జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లోనూ 115 న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 474 మందికిగానూ 359 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 72,219 మంది, తెలంగాణలో 40,531 మంది న్యాయవాదులు సేవలు అందిస్తున్నారు’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని