ఏపీలో 93.2%, తెలంగాణలో 91.7% వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లోనే

ఆంధ్రప్రదేశ్‌లో 93.2%, తెలంగాణలో 91.7% వ్యవసాయ కుటుంబాలు రుణ ఊబిలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం

Published : 04 Dec 2021 05:18 IST

దేశంలో తొలి రెండు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 93.2%, తెలంగాణలో 91.7% వ్యవసాయ కుటుంబాలు రుణ ఊబిలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం వెల్లడించారు.

వ్యవసాయకుటుంబాల రుణభారంపై నిర్వహించిన 70వ రౌండ్‌ సర్వే (2012-13) ప్రకారం అప్పుల్లో చిక్కుకున్న వ్యవసాయ కుటుంబాల సంఖ్య ఏపీలో 92.9% ఉండగా, 77వ రౌండ్‌ సర్వే (2018-19) నాటికి 93.2%కి చేరినట్లు చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణలో రుణభారం మోస్తున్న రైతు కుటుంబాల సంఖ్య 89.1% నుంచి 91.7%కి చేరినట్లు వెల్లడించారు. జాతీయస్థాయిలో రుణ ఊబిలో ఉన్న రైతుకుటుంబాలు సగటున ఇదివరకు 51.9% ఉండగా, ఇప్పుడు అది 50.2%కి తగ్గిందని కేంద్రమంత్రి చెప్పారు. కేంద్రమంత్రి సమాధానం ప్రకారం తెలుగురాష్ట్రాల్లో మాత్రం రుణబాధితుల సంఖ్య పెరిగింది. అప్పుల ఊబిలో కూరుకున్న అత్యధిక వ్యవసాయ కుటుంబాల్లో ఏపీ మొదటి, తెలంగాణ రెండోస్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానంలో కేరళ (69.9%), కర్ణాటక (67.7%), తమిళనాడు (65.1%) ఒడిశా (61.2%), మహారాష్ట్ర (54%), పశ్చిమబెంగాల్‌ (50.8%) ఉన్నాయి. మిగతా అన్నిరాష్ట్రాల్లోని రుణబాధిత కుటుంబాల సంఖ్య జాతీయసగటుకంటే తక్కువే ఉంది.

పీఎం కిసాన్‌ నిధులు తెలంగాణకు రూ.1515 కోట్లు
ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) కింద 2021-22లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రూ.1956.66కోట్లు, తెలంగాణ రైతులకు రూ.1515.06కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. భాజపా రాజ్యసభ సభ్యుడు వై.ఎస్‌.చౌదరి శుక్రవారం సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని