దివ్యాంగుల ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కృషి

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంలో భాగంగా ఉన్న దివ్యాంగుల శాఖను వేరుచేసి ప్రత్యేక శాఖ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ

Updated : 04 Dec 2021 06:19 IST

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హామీ

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంలో భాగంగా ఉన్న దివ్యాంగుల శాఖను వేరుచేసి ప్రత్యేక శాఖ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వయసుతో నిమిత్తం లేకుండా 40 శాతం ఆపైన వైకల్యంతో బాధపడుతున్నవారందరికీ ప్రభుత్వం రూ.3,116 పింఛన్‌ అందజేస్తోందన్నారు. అన్ని సంక్షేమ పథకాలతో పాటు రెండు పడకల ఇళ్ల కేటాయింపులో 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వాలు ట్రైసైకిళ్లు, మోటారు వాహనాలు 35 సంవత్సరాలు పైబడి, డిగ్రీ చదివినవారికి మాత్రమే ఇచ్చేవని, ప్రస్తుతం ఇంటర్‌ చదివి అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటిని అందజేస్తున్నట్లు తెలిపారు. హోంమంత్రి మహమూద్‌అలీ, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. ఆబ్కారీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలు, పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే దివ్యాంగ క్రీడాకారులకు ఎల్బీ స్టేడియంలో సాధన చేసేందుకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తే వారు ఉన్నతస్థాయికి ఎదుగుతారన్నారు. అనంతరం కొప్పుల సహచర మంత్రులతో కలిసి ‘ప్రార్థనా ప్రదేశాలను దివ్యాంగులకు అనువుగా చేసేందుకు మార్గదర్శకాలు’ పేరిట రూపొందించిన కరదీపికను ఆవిష్కరించారు. పలువురు క్రీడాకారులకు క్రికెట్‌ కిట్లు, కండరక్షీణత వ్యాధితో బాధపడుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లికార్జున్‌గౌడ్‌కు ఆటోమెటిక్‌ వీల్‌ఛైర్‌, అలాగే వివిధ సమస్యలున్న వారికి అవసరమైన పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌, దివ్యాంగుల సంక్షేమశాఖ సంచాలకురాలు బి.శైలజ పాల్గొన్నారు. అంతకుముందు దివ్యాంగ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని