హెచ్‌ఎండీఏ ఖజానాకు రూ.474 కోట్లు!

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఖజానాకు ఉప్పల్‌ భగాయత్‌ భూములు రూ.474.61 కోట్ల నిధులు ఆర్జించిపెట్టాయి. గురు, శుక్రవారాల్లో జరిగిన మూడో దశ ఇ-వేలంతో ఈ మొత్తం సమకూరింది

Published : 04 Dec 2021 05:18 IST

కాసులు కురిపించిన ఉప్పల్‌ భగాయత్‌ భూములు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఖజానాకు ఉప్పల్‌ భగాయత్‌ భూములు రూ.474.61 కోట్ల నిధులు ఆర్జించిపెట్టాయి. గురు, శుక్రవారాల్లో జరిగిన మూడో దశ ఇ-వేలంతో ఈ మొత్తం సమకూరింది. మొదటి, రెండు దశల్లో మిగిలిన ప్లాట్లతో పాటు కొత్తగా మరికొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మొత్తం 1,35,408 చదరపు గజాల్లో 44 ప్లాట్లను హెచ్‌ఎండీఏ ఈ దశలో విక్రయానికి ఉంచింది. మొదటిరోజు 19,719 చ.గజాల్లో 23 ప్లాట్లు రూ.141.61 కోట్లకు అమ్ముడుపోయాయి. రెండోరోజు శుక్రవారం 1,15,689 చ.గజాలున్న 21 ప్లాట్లను వేలానికి ఉంచగా.. ఐదు మల్టీ పర్పస్‌ ప్లాట్లు తప్ప మిగతా 16 చిన్న ప్లాట్లను రూ.333 కోట్లకు దక్కించుకున్నారు.

రెండో రోజు గరిష్ఠం రూ.72 వేలు..
రెండోరోజు ఇ-వేలంలో ఓ ప్లాటు చదరపు గజానికి గరిష్ఠంగా రూ.72 వేలకు, కనిష్ఠంగా రూ.36 వేలకు కోట్‌ అయ్యాయి. మొదటి రోజు రెండు ప్లాట్లు రికార్డు స్థాయిలో రూ.1.01 లక్ష పలకగా.. రెండో రోజు ప్లాట్లు 1980 చ.గజాల నుంచి 11,277 చ.గజాల మధ్య ఉండటంతో కనీసం రూ.60 వేలు పలకొచ్చని అంచనా వేశారు. అంతకుమించి రూ.72 వేలు పలికింది. రెండోరోజు సగటున ఒక్కో ప్లాటు రూ.51,037కు పోయింది. నిర్ణయించిన కనీస ధర రూ.35 వేలకు రూ.వెయ్యి పెంచి బిడ్లు మొదలు కాగా ఓ ప్లాటు రూ.36 వేలకే అమ్ముడయింది. ఈ రెండు రోజుల్లో మొత్తం 84,966 చ.గజాల్లో ఉన్న 39 చిన్నాపెద్ద ప్లాట్లు ఇ-వేలంలో రూ.474.61 కోట్లకు అమ్ముడుపోయాయి. సగటున ప్లాటు రూ.55,859కు బిడ్డర్లకు దక్కింది.


ప్రవాసీయులదే హవా

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీఎస్‌ వేదికగా జరిగిన ఇ-వేలం ప్రక్రియలో ఎక్కువగా ప్రవాసీయులే పాల్గొన్నట్లు సమాచారం. రెండు రోజుల్లోనూ చిన్న ప్లాట్లపైనే ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. ఉప్పల్‌ వైపు నిర్మాణాలు జోరుగా పెరుగుతుండటంతో పాటు మూసీ పరిసరాలూ నివాసయోగ్యంగా మారడం ఈసారి వేలానికి ఊపు తెచ్చిందని ఓ అధికారి పేర్కొన్నారు. సమీపంలో ఆకాశహర్మ్యాలూ పెద్దఎత్తున విస్తరిస్తున్నాయి. వేలంలో మిగిలిన 50,442 చ.గజాల భూమికి మరికొంత భూమిని కలిపి త్వరలోనే వేలం వేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. పక్కనే ఉన్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ భూములనూ హెచ్‌ఎండీఏనే వేలం వేయనుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని