700 మంది మావోయిస్టులకు రహస్యంగా టీకాలు

దాదాపు 700 మంది మావోయిస్టులు కరోనా టీకాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి టీకాలతో పాటు చికిత్సకు అవసరమైన ఔషధాలూ వీరికి చేరాయి. గురువారం ఛత్తీస్‌గఢ్‌లో దంతెవాడ పోలీసుల ఎదుట

Published : 04 Dec 2021 05:18 IST

ఏపీ, తెలంగాణల నుంచి సరఫరా
అనారోగ్యంతో బాధపడుతున్న అగ్రనేతలు
లొంగిపోయిన నక్సల్‌ దంపతుల వెల్లడి

బస్తర్‌: దాదాపు 700 మంది మావోయిస్టులు కరోనా టీకాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి టీకాలతో పాటు చికిత్సకు అవసరమైన ఔషధాలూ వీరికి చేరాయి. గురువారం ఛత్తీస్‌గఢ్‌లో దంతెవాడ పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సల్‌ దంపతులు పొజ్జో, లఖ్కె ఈ వివరాలను వెల్లడించారు. మావోయిస్టు దక్షిణ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపాడు. హిడ్మా, సుజాత, వికాస్‌, రఘుతో పాటు అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు కూడా టీకాలు తీసుకున్నట్టు తెలిపాడు. ఛత్తీస్‌గఢ్‌లోని టీకాలపై అనుమానంతోనే.. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నట్టు వెల్లడించాడు.ఈ క్రమంలోనే మావోయిస్టుల ఆరోగ్య పరిస్థితులపై పొజ్జో కీలక సమాచారం అందించాడు. దక్షిణ బస్తర్‌ విభాగం ఇన్‌ఛార్జ్‌ రఘుతో పాటు మాసా బెటాలియన్‌ కమాండర్‌ రాజేశ్‌.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెప్పాడు. వారికి కరోనా సోకి ఉండవచ్చని అన్నాడు. వారు కర్రల సహాయంతో నడుస్తున్నట్టు, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. రఘుపై రూ.25 లక్షల రివార్డు ఉంది. అనారోగ్యంతో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని ఈ సందర్భంగా దంతెవాడ ఎస్‌పీ అభిషేక్‌ పల్లవ్‌  పిలుపునిచ్చారు. వారికి మెరుగైన చికిత్స అందించి, ప్రాణాలు రక్షిస్తామని హామీనిచ్చారు.

ఎవరీ పొజ్జో, లఖ్కె?
పొజ్జో, లఖ్కెల అసలు పేర్లు సంజు మాద్వి, తులసి మాద్వి. 70 మంది జవాన్ల హత్య కేసులో, భద్రతా దళాలపై జరిగిన 12 దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో వీరిపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని