ఆదివాసీల ప్రగతికి అడ్డుగా సిబ్బంది కొరత

కొండాకోనల్లో నివసించే ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కోసం సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లు సిబ్బంది లేమితో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో

Published : 04 Dec 2021 05:18 IST

ఏళ్లుగా ఐటీడీఏల్లో భర్తీకాని ఖాళీలు
మంజూరైనవి 205 పోస్టులు.. పని చేస్తున్నది 71 మందే

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఉట్నూర్‌, న్యూస్‌టుడే: కొండాకోనల్లో నివసించే ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కోసం సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లు సిబ్బంది లేమితో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఏటూరునాగారం, ఉట్నూర్‌, భద్రాచలం, మన్ననూర్‌ ఐటీడీఏల్లో 66 శాతం ఉద్యోగుల కొరత కారణంగా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో గిరిజనుల దరి చేరడం లేదు. వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలు దశాబ్దాల నుంచి భర్తీకి నోచుకోవడం లేదు. నాలుగు ఐటీడీఏలకు కలిపి 205 పోస్టులు మంజూరు కాగా 71 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 134 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

గిరిజనుల్లోనే అత్యంత వెనుకబడిన వారికి పీవీటీజీలు అంటారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు వస్తుండగా ఇందుకు సంబంధించి పథకాలు అమలు చేసి పర్యవేక్షించే అధికారే లేరు. ఏజెన్సీ ప్రాంతంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతి ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి (అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ) ఉండాలి. ప్రస్తుతం ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. నాలుగు ఐటీడీఏల పరిధిలో గిరిజన ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ఏజెన్సీ డీఈవో పోస్టులు ఉన్నా అధికారులు లేరు. చాలా ప్రాంతాల్లో ఈ బడులు మూసే ఉంటున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో అంకిత్‌ ప్రత్యేక తనిఖీలు చేసి పాఠశాలలకు గైర్హాజరైన ఇద్దరు ఉపాధ్యాయులను నవంబర్‌ 29న సస్పెండ్‌ చేయడం ఈ పోస్టుల భర్తీ అవసరాన్ని తెలుపుతోంది. మన్ననూర్‌ ఐటీడీఏలో కేవలం ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ మాత్రమే పనిచేస్తున్నారు.


‘గిరి’ రైతుకు కరవైన చేయూత..

టీడీఏల పరిధిలో గిరిజన రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు గిరి ఉద్యానవనాలను 1989లో స్థాపించారు. 20 నుంచి 30 ఎకరాల్లో ఇవి ఉన్నాయి. ఆసిఫాబాద్‌లో ఉద్యానవన కేంద్రం స్థాపించినప్పటికీ ఉద్యానవన అధికారి లేకపోవడంతో ఏడాదిగా అది తెరచుకోలేదు. ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలో అయిదుగురు ఉద్యానవన అధికారులు ఉండాలి. ప్రస్తుతం ఒక్కరూ లేరు. నాలుగు ఐటీడీఏల్లోనూ వ్యవసాయ అధికారి పోస్టులు ఖాళీగా ఉండడంతో రైతులకు సలహాలు ఇచ్చేవారే కరవయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని