ఉత్తరాంధ్రకు దగ్గరగా జవాద్‌ తుపాను

జవాద్‌ తుపాను.. మరింత బలపడి తీవ్రతుపానుగా మారనుంది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి.. అక్కడ నుంచి ఉత్తరదిశగా కదులుతూ 5వ తేదీ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే

Published : 04 Dec 2021 05:31 IST

రేపు పూరీ వద్ద తీరం దాటే అవకాశం
భారీ నుంచి అతిభారీ వర్షాలు.. 100 కి.మీ. వేగంతో గాలులు

ఈనాడు, అమరావతి: జవాద్‌ తుపాను.. మరింత బలపడి తీవ్రతుపానుగా మారనుంది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి.. అక్కడ నుంచి ఉత్తరదిశగా కదులుతూ 5వ తేదీ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దీని ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాల్లో అధికారులు శనివారానికి రెడ్‌ ఎలర్ట్‌ జారీచేశారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 420 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. జవాద్‌ తుపాను ఒడిశాలోని పూరీ జిల్లాలో ఆదివారం తీరం దాటి, తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్‌ పీకే జెనా తెలిపారు. తీరం దాటే సమయంలో 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. దిశ మార్చుకుని ఒడిశా మీదుగా వెళ్తూ తీరం దాటకపోవచ్చనీ ఆయన చెప్పారు. శుక్రవారంఅర్ధరాత్రి నుంచే తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. శనివారం ఉదయానికి గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని