ఆనకట్టల భద్రత అత్యవసరం

‘‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘నేషనల్‌ డ్యాం సేఫ్టీ బిల్‌(జాతీయ ఆనకట్టల భద్రత బిల్లు)’ జలాశయాల భద్రత, నిర్వహణ, యాజమాన్యానికి మరింత దోహదం చేస్తుంది. కొత్తగా ఎలాంటి

Published : 05 Dec 2021 05:34 IST

‘నేషనల్‌ డ్యాం సేఫ్టీ బిల్లు’ అందుకే

రాష్ట్రాల హక్కులకు ఎలాంటి నష్టం ఉండదు

డ్యాంల నిర్వహణకు నిధులు తప్పనిసరి

శ్రీశైలం సహా పలు ప్రాజెక్టులు జాతీయ అథారిటీ చేతుల్లోకే

‘ఈనాడు’తో కృష్ణా బోర్డులో కీలక అధికారి రవికుమార్‌ పిళ్లై

ఈనాడు హైదరాబాద్‌: ‘‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘నేషనల్‌ డ్యాం సేఫ్టీ బిల్‌(జాతీయ ఆనకట్టల భద్రత బిల్లు)’ జలాశయాల భద్రత, నిర్వహణ, యాజమాన్యానికి మరింత దోహదం చేస్తుంది. కొత్తగా ఎలాంటి సమస్యలకు అవకాశం లేదు. ప్రాజెక్టు ఒక రాష్ట్రం పరిధిలోనే ఉంటే దాని నిర్వహణ బాధ్యత ఆ రాష్ట్రంలోని భద్రత కమిటీదే. రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నవి, ఒక రాష్ట్ర పరిధిలో ఉండి ఇంకో రాష్ట్రం యాజమాన్యంలో ఉన్న వాటిని మాత్రమే జాతీయ ఆనకట్టల భద్రత ప్రాధికార సంస్థ పర్యవేక్షిస్తోంది’’ అని ఈ బిల్లు రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన, కృష్ణా బోర్డులో కీలక అధికారిగా ఉన్న రవికుమార్‌ పిళ్లై పేర్కొన్నారు. తాజాగా రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ఆయన ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లు ఆవశ్యకత, ప్రాధాన్యం ఏంటి?

దేశంలో ఉన్న భారీ డ్యాంలలో మూడోవంతువి నిర్మించి 25 ఏళ్లు దాటింది. ఇందులో 225 డ్యాంలు నిర్మించి వందేళ్లు దాటింది. దేశ వార్షిక నీటి అవసరాల్లో ఎక్కువ భాగం వీటి నుంచే లభ్యమవుతుంది. వాతావరణ మార్పుల ప్రభావంతో దేశంలో తరచూ వర్షపాతంలో తీవ్ర ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ఒక్కోసారి ప్రాజెక్టులకు అకస్మాత్తుగా వరద తాకిడి పెరుగుతోంది. నిర్వహణ సరిగాలేని, పటిష్ఠత దెబ్బతిన్న జలాశయాల వల్ల ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో అవన్నీ భద్రంగా, పటిష్ఠంగా ఉండటం అత్యంత కీలకం. వాటి నిర్వహణ సక్రమంగా జరగడానికి ఈ బిల్లు ఉపకరిస్తుంది.

ఇకపై ప్రాజెక్టుల విషయంలో కేంద్రం పాత్ర ఎలా ఉండబోతోంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం ఉందా?

డ్యాంల భద్రతపై జాతీయ ఆనకట్టల భద్రత కమిటీ(నేషనల్‌ కమిటీ ఆన్‌ డ్యాం సేఫ్టీ, ఎన్‌.సి.డి.ఎస్‌), జాతీయ ఆనకట్టల భద్రత ప్రాధికార సంస్థ (నేషనన్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, ఎన్‌.డి.ఎస్‌.ఎ)లను ఏర్పాటుచేయడం వరకే కేంద్రం బాధ్యత. ఎన్‌.సి.డి.ఎస్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన నిపుణులు ఉంటారు. ఈ కమిటీ దేశంలోని అన్ని ఆనకట్టల భద్రతకు సంబంధించిన విధానాలు, అనుసరించాల్సిన నిబంధనలను(ప్రొటోకాల్స్‌)  రూపొందిస్తుంది. విధానాల అమలు, మార్గదర్శకాలు మొదలైనవి పర్యవేక్షించే సంస్థగా ఎన్‌.డి.ఎస్‌.ఎ వ్యవహరిస్తుంది. రెండు సంస్థలూ జాతీయ ప్రాధాన్యం ఉన్న డ్యాంలను ఎక్కువగా పర్యవేక్షిస్తాయి. ఒక రాష్ట్రానికి చెందిన, ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన వాటి పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర డ్యాం భద్రత కమిటీ(ఎస్‌.సి.డి.ఎస్‌) చూసుకుంటుంది. ఈ కమిటీలో ఎగువన, దిగువన ఉన్న రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అందువల్ల అంతర్రాష్ట్ర సమస్యలకు సానుకూల పరిష్కారం కూడా లభిస్తుంది. ఈ బిల్లు వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలకు అవకాశం ఉండకపోవచ్చు.

ఆనకట్టల నిర్వహణ సరే. దానికి అవసరమైన నిధులను ఎవరివ్వాలి?

పరిమిత ఆర్థిక వనరులు, సమర్థత లోపించడం వంటి కారణాలతో ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్వహణ సరిగా ఉండటం లేదు. ఇలా దీర్ఘకాలం కొనసాగితే డ్యాం పటిష్ఠత దెబ్బతింటుంది. ఈ కారణంతో ఏదైనా అనుకోని ప్రమాదం  జరిగినప్పుడు ప్రభావిత ప్రజలతోపాటు దిగువన ఉన్న ఇతర డ్యాంలు కూడా ముప్పు ముంగిట్లోకి వెళ్తాయి. ఊహకందనంత నష్టం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పక్క రాష్ట్రాలపైనా ఈ ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఆమోదించిన భద్రత బిల్లు ప్రకారం ఆనకట్ట ఏ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో/ఎవరి యాజమాన్యం కింద ఉందో వారు నిధులు కేటాయించడం తప్పనిసరి. దేశంలోని డ్యాంలన్నీ సాధారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్ర కార్పొరేషన్ల యాజమాన్యంలో ఉంటాయి. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉంటుంది.

ఏపీలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోవడానికి కారణాలు విశ్లేషించారా?

అన్నమయ్య ప్రాజెక్టుకు భారీ వరద వచ్చింది. అందంతా ప్రధాన గేట్లు(స్పిల్‌వే) ద్వారా దిగువకు వెళ్లకపోవడమే దుర్ఘటనకు కారణమనే సమాచారం ఉంది. ఆ పరిస్థితికి కారణమేమిటి? వచ్చిన వరదను ఎందుకు దిగువకు పంపలేకపోయారు? ఇలాంటివన్నీ సమగ్ర అధ్యయనం తర్వాతే తెలుస్తాయి. స్పిల్‌వే డిజైన్‌ సక్రమంగా ఉందా? నిర్వహణ నిబంధనలు పాటించడంలో వైఫల్యం జరిగిందా? గేట్ల నిర్వహణలో లోపాలున్నాయా? ఇలా అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంది.

శ్రీశైలం డ్యాం భద్రతకు నిపుణుల కమిటీ సిఫార్సులుచేసి చాలా కాలమైంది. అవేమీ అమలు కాలేదు. ఇలాంటి వాటికి బిల్లులో ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా?

సాధారణంగా ఒక ఆనకట్ట భద్రతకు సంబంధించిన అంశాలను చూడాల్సిన బాధ్యత ఆ రాష్ట్రంలోని డ్యాం భద్రత కమిటీదే. వివిధ కారణాలతో అవి అమలుకాకపోయి ఉండొచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నందున ఇకపై దాని పర్యవేక్షణ జాతీయ ఆనకట్టల భద్రత ప్రాధికార సంస్థ పరిధిలోకి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో సిఫార్సులు అమలుకు నోచుకుంటాయి. సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని