అడవి మృగాల ఆహారమేంటి?

అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో మృగాలు.. వాటి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం, వ్యాధులు ఇతర అంశాలను విశ్లేషించేందుకు తెలంగాణ అటవీశాఖ క్షేత్రస్థాయి ప్రయోగశాలను ప్రారంభించింది. ఈ ఏడాది

Updated : 05 Dec 2021 05:19 IST

జంతువుల వేట అలవాట్ల విశ్లేషణకు ప్రత్యేక ల్యాబ్‌

మన్ననూరు చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు

ఈటీవీ, మహబూబ్‌నగర్‌ , న్యూస్‌టుడే, అమ్రాబాద్‌

అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో మృగాలు.. వాటి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం, వ్యాధులు ఇతర అంశాలను విశ్లేషించేందుకు తెలంగాణ అటవీశాఖ క్షేత్రస్థాయి ప్రయోగశాలను ప్రారంభించింది. ఈ ఏడాది జులైలో నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూరు చెక్‌పోస్టు వద్ద దీన్ని ఏర్పాటుచేశారు. అమ్రాబాద్‌ అభయారణ్యంలో కనిపించే అరుదైన జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాల శరీర నమూనాలనూ సేకరించి అవి పాడవకుండా ఇక్కడ భద్రపరుస్తున్నారు.

క్రూర మృగాలు వేటాడిన జంతువు వెంట్రుకలు, ఎముకలు, కొన్ని శరీర భాగాలు జీర్ణం కాకుండా మలం ద్వారా బయటకు వస్తాయి. ఆ నమూనాను విశ్లేషించడం ద్వారా ఆ మృగాల ఆహారపు అలవాట్లు, అవి ఎక్కువగా వేటాడుతున్న జంతువుల సమాచారం, వాటికున్న రోగాలు, ఏమి తినడం ద్వారా ఏ రోగాల బారిన పడ్డాయో అమ్రాబాద్‌ ప్రయోగశాలలో తెలుసుకుంటారు. అంతరించిపోతున్న అరుదైన జంతువు మూషిక జింకల సంతతిని అభయారణ్యంలో ప్రత్యేక పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. వాటి కదలికలు ఎలా ఉన్నాయి? అవి ఏ జంతువులకైనా ఆహారంగా మారుతున్నాయా? అనే అంశాన్నీ గమనిస్తున్నారు. ఇప్పటివరకు 350కి పైగా నమూనాలను సేకరించినట్లు ల్యాబొరేటరీ ఇన్‌ఛార్జి, బయాలజిస్ట్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు.

మల నమూనాలను మైక్రోస్కోప్‌ ద్వారా విశ్లేషిస్తున్న బయాలజిస్ట్‌ మహేందర్‌ రెడ్డి

కళేబరాలు భద్రం...

అమ్రాబాద్‌ అభయారణ్యంలోని జంతువులు, కీటకాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షుల్ని కోర్‌ ఏరియాలో మాత్రమే చూడగలం. వాటి కళేబరాలను భద్రపరచడం ద్వారా ప్రయోగశాలలో అందరూ చూసేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి అడవుల్లోనే కనిపించే రెండు తలల పాము, గోండ్రు కప్ప, తేళ్లు, సీతాకోక చిలుకల్ని సేకరించి వాటి శరీరం పాడవకుండా ఉంచుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చుక్కల దుప్పి కళేబరానికి పరీక్ష నిర్వహిస్తుండగా దాని గర్భంలో మూడు నెలల పిండం బయటపడింది. దానిని అలాగే భద్రపరిచారు. శిక్షణ పొందేవారికి, క్షేత్రస్థాయి పర్యటన కోసం వచ్చే విద్యార్థులకు, పర్యాటకులకు ఈ నమూనాలను చూపించి నల్లమల అభయారణ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. నమూనాల విశ్లేషణ ఫలితాలు భవిష్యత్తులో ఎన్నోరకాలుగా ఉపయోగపడతాయని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఎప్డీవో రోహిత్‌ పేర్కొన్నారు.

ఫీల్డ్‌ ల్యాబ్‌లో భద్రపరిచిన జింక గర్భస్థ పిండం

ఇప్పటివరకు విశ్లేషణలో గుర్తించింది ఇవి..

పులులు ఎక్కువగా సాంబార్‌, అడవి పందులు, చుక్కల దుప్పులను ఆహారంగా తీసుకుంటున్నాయి. చిరుతలు సైతం చుక్కల దుప్పులు, కొండముచ్చులు, అడవి పందులను వేటాడుతున్నాయి. ఎలుగుబంట్లకు చెదలు ఇష్టమైన ఆహారం. ఇవికాకుండా పరికిపండ్లు, కత్తెర పండ్లు, గొట్టికాయల్లాంటివి ఎక్కువగా తింటున్నాయి.

మన్ననూర్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఉన్న ఫీల్డ్‌ ల్యాబొరేటరీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని