ఎత్తిపోతలకు కరెంటు భారీ వినియోగం

రాష్ట్రంలో సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాలకు కరెంటు వినియోగం భారీగా ఉంది. గత ఏప్రిల్‌ నుంచి అక్టోబరు నాటికే 261.60 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ పథకాలకు వినియోగించే

Published : 05 Dec 2021 04:40 IST

ఏప్రిల్‌ నుంచి అక్టోబరుకే 261.60 కోట్ల యూనిట్ల వాడకం

విద్యుత్‌ బిల్లు రూ.1,569 కోట్లు

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాలకు కరెంటు వినియోగం భారీగా ఉంది. గత ఏప్రిల్‌ నుంచి అక్టోబరు నాటికే 261.60 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ పథకాలకు వినియోగించే కరెంటుకు యూనిట్‌కు రూ.5.80 చొప్పున ఛార్జీ చెల్లించాలి. ఇది పెరగదు, తగ్గదు. అదనంగా ఎత్తిపోతల మోటార్ల సామర్థ్యాన్ని బట్టి నెలకు కిలోవాట్‌కు రూ.165 చొప్పున ఏటా జులై నుంచి నవంబరు దాకా ...మోటార్లు నడిపినా నడపకపోయినా స్థిరఛార్జీ కింద విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు నీటిపారుదల శాఖ చెల్లించాలి. వినియోగించిన కరెంటుకు యూనిట్‌కు ఈ స్థిరఛార్జీ కలిపితే మొత్తమ్మీద యూనిట్‌కు రూ.6 వరకూ సగటున ఛార్జీ చెల్లించాలి. ఈ లెక్కన గత ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకూ వాడిన 261.60 కోట్ల యూనిట్లకు  రూ.1569 కోట్లకు పైగా కరెంటు బిల్లు వచ్చింది.


* రాష్ట్రంలో మొత్తం అన్ని రకాల ఎత్తిపోతల పథకాలకు కలిపి 366 పంపులున్నాయి. వీటిలో 84 కృష్ణానదిపై, మిగిలినవి గోదావరి నదిపై ఉన్నాయి. వీటికిచ్చిన కరెంటు కనెక్షన్‌ లోడు 15,732 మెగావాట్లు. ఈ సామర్థ్యంలో 80 శాతం మేర లోడును ఏటా జులై నుంచి నవంబరు వరకూ వాడుకుంటామని అలా వాడుకున్నా వాడుకోకపోయినా స్థిరఛార్జీని చెల్లిస్తామని డిస్కంతో నీటిపారుదలశాఖ ఒప్పందాలున్నాయి. ప్రస్తుతం కృష్ణానదిపై 50, గోదావరిపై 259 మోటార్లు వినియోగిస్తున్నారు.


* గత ఆర్థిక సంవత్సరం(2020-21)లో మొత్తం 1,215 కోట్ల యూనిట్ల కరెంటు వాడతామని నీటిపారుదల శాఖ ఏడాది ఆరంభంలోనే డిస్కంలకు తెలిపినా చివరకు 355 కోట్ల యూనిట్ల కరెంటు వాడగా ఈ ఏడాది(2021-22)లో తొలి 7 నెలల్లో అందులో 74 శాతం(261.60 కోట్ల యూనిట్లు) వాడారు. ఇక ఈ యాసంగిలో వరి సాగు పెరిగితే మరింత వినియోగించే అవకాశాలున్నాయి. వరి సాగు వద్దని ప్రభుత్వం రైతులకు గట్టిగా చెబుతున్నందున జనవరి నుంచి మార్చి వరకూ ఎత్తిపోతల ద్వారా నీటి సరఫరా ఉంటుందా? లేదా? అని విద్యుత్‌ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని