కరీంనగర్‌లో 43 మంది వైద్య విద్యార్థులకు కరోనా

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్‌లో ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఏకంగా 43 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అధికారిక గణాంకాలను

Published : 06 Dec 2021 03:37 IST

రాష్ట్రంలో 2 వారాల్లో 161 క్రియాశీల కేసుల పెరుగుదల
కొత్తగా 156 పాజిటివ్‌ల నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్‌లో ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఏకంగా 43 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అధికారిక గణాంకాలను పరిశీలిస్తే కొవిడ్‌ పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోందనే విషయం స్పష్టమవుతోంది. గత నెల 20న 134 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ నెల 1న 193 నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే ఈ నెల 4న కేసుల సంఖ్య 200 దాటడం గమనార్హం. క్రియాశీల కేసులను పరిశీలిస్తే.. పాజిటివ్‌ల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గత నెల 20న రాష్ట్రంలో 3,626 క్రియాశీల(యాక్టివ్‌) కేసులు ఉండగా.. ఈ నెల 5న 3,787కి పెరిగాయి. కేవలం 2 వారాల వ్యవధిలోనే 161 క్రియాశీల కేసులు పెరిగినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే.. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

4 వేలకు చేరువగా మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 156 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,76,943కు పెరిగింది. కరోనా మరణాలు ఆదివారం 4 వేల చేరువకు చేరుకున్నాయి. మహమ్మారితో మరొకరు మృతిచెందగా.. ఇప్పటివరకూ మొత్తం 3,999 మంది కన్నుమూశారు. తాజాగా 147 మంది కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 6,69,157 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 5న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,787 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 25,693 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 2,87,64,155కు పెరిగింది. 1,372 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 54 కేసులు నమోదు కాగా.. కరీంనగర్‌లో 47, రంగారెడ్డిలో 12 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రానికి 291 మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాగా.. కొవిడ్‌ పరీక్షల్లో అందరూ నెగెటివ్‌గానే నిర్ధారణ అయ్యారు.  

కర్ణాటకలోని నవోదయ విద్యాలయంలో 70 మందికి కొవిడ్‌

చిక్కమగళూరు, న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లా ఎన్‌.ఆర్‌.పుర తాలూకా సీగోడులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. అక్కడ 63 మంది విద్యార్థులు సహా మొత్తం 70 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. బెంగళూరు సమీపం ఆనేకల్‌ తాలూకా మరసూరు గ్రామంలోని ఓ నర్సింగ్‌ కళాశాలలో పలువురికి కొవిడ్‌ సోకింది.


వైద్య కళాశాలకు సెలవు

కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌ గ్రామీణ మండలం బొమ్మకల్‌ గ్రామంలోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తొలుత అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. శని, ఆదివారాల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 42 మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు కళాశాల ఛైర్మన్‌ లక్ష్మీనరసింహారావు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి కళాశాలకు సెలవు ప్రకటించారు. గత ఆదివారం నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని