వీలైనంత ధాన్యం కొనుగోలు చేయండి

రైతుల నుంచి వీలైనంత మేర వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే తక్షణం కొనాలంటూ ఆదేశాలివ్వడానికి నిరాకరించింది. ఇందుకు సంబంధించి

Published : 07 Dec 2021 04:13 IST

ప్రభుత్వానికి హైకోర్టు సూచన
తక్షణం కొనాలంటూ ఆదేశాలివ్వడానికి నిరాకరణ

ఈనాడు, హైదరాబాద్‌: రైతుల నుంచి వీలైనంత మేర వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే తక్షణం కొనాలంటూ ఆదేశాలివ్వడానికి నిరాకరించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే ఫిబ్రవరికి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ ఉస్మానియా న్యాయశాస్త్ర విద్యార్థి బి.శ్రీకర్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కనీస మద్దతు ధర రూ.1960 ఉండగా ప్రభుత్వం కొనకపోవడంతో దళారులు రూ.1000కే కొనుగోలు చేస్తున్నారన్నారు. వాతావరణ మార్పులతో ధాన్యం దెబ్బతింటుందన్న ఆందోళనతో రైతులు తక్కువ ధరకు తెగనమ్ముకుంటున్నారన్నారు. ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టం ఏముందని, ఏ చట్టం కింద తాము ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలో చెప్పాలని ప్రశ్నించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేసిన ఉద్యమంలో మరణించిన 700 మంది రైతులకు రూ.3 లక్షల చొప్పున ప్రభుత్వం చెల్లించడం అభినందనీయమంది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌ అపరిపక్వ దశలో వేశారని, ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రారంభించిందని చెప్పారు. 6349 ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభించి 4.53 లక్షల మంది రైతుల నుంచి రూ.27 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించి రూ.2800 కోట్లు చెల్లించిందన్నారు. ఈ ధాన్యం కొనుగోళ్లు జనవరి వరకు కొనసాగుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని