Published : 07/12/2021 04:26 IST

వారసత్వ బదిలీ.. వివాదాలుగా మారి

రిజిస్ట్రేషన్‌ తరువాత అడ్డు చెబుతున్న కుటుంబ సభ్యులు
స్లాటు నమోదైతే ఆపలేమంటున్న అధికారులు
చట్టం అమలులో స్పష్టత లేకపోవడమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌

‘నేను కొన్న భూమిని నా కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశాను. అతను ఆకస్మికంగా మరణించాడు. ఆ భూమిని కోడలి పేరుపై వారసత్వ బదిలీ చేశారు. కుటుంబంలో భాగపంపిణీ జరగనేలేదు. నేను ఉండగా ఏకపక్షంగా ఎలా చేస్తారు. నాకు నోటీసైనా ఇవ్వలేదు. ఇది అన్యాయం’ అంటూ ఓ పెద్దావిడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయ పోరాటానికి దిగారు. ఇలా కుటుంబ సభ్యులందరి ఆమోదం లేకుండానే వారసత్వ బదిలీ చేశారంటూ పలు జిల్లాల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. భూముల వారసత్వ బదిలీ ప్రక్రియలో స్పష్టత లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ధరణి పోర్టల్‌ ఆధారంగా ఆటోమేటిక్‌ విధానంలో వారసత్వ బదిలీ (సక్సెషన్‌) పూర్తి చేసి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేస్తున్న తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ధరణిలో సులువుగా, ఆటోమేటిక్‌ విధానంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు పూర్తిచేస్తున్న తీరు బాగున్నా.. అదే తీరును వారసత్వ బదిలీలో అమలు చేయడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అమలుకాని ముఖ్యమంత్రి ఆదేశాలు

వారసత్వ బదిలీ హక్కుల విషయంలో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెస్తుందని గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే పాసుపుస్తకాల్లో ముందుగానే కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేస్తారని, తద్వారా వారసత్వ వివాదాలు ఉండవని సూచించారు. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తమైనప్పటికీ రెవెన్యూశాఖ అమల్లోకి తేలేదు. పోర్టల్‌ అమల్లోకి వచ్చి ఏడాది దాటినా దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారసత్వంపై అభ్యంతరాలు ఉన్నచోట వివాదాలు వస్తూనే ఉన్నాయి. వారసత్వ బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలంటే రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయి విచారణ అధికారం కల్పించాలని, లేనిపక్షంలో కుటుంబ ధ్రువీకరణ పత్రం(ఫ్యామిలీ సర్టిఫికెట్‌) తప్పనిసరి చేయడమనే నిబంధనను జోడించాలంటూ రెవెన్యూ సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది.


గతంలో ఇలా...

తంలో భూయజమాని తదనంతరం వారసత్వ బదిలీకి క్షేత్రస్థాయి విచారణ ఉండేది. యజమాని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసేవారు. పది రోజుల వ్యవధిలో నోటీసులకు వచ్చిన వివరణ, క్షేత్రస్థాయి అధికారుల విచారణ నివేదిక ఆధారంగా తహసీల్దారు వారసులెవరనేది తేల్చి... రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కులు బదలాయించేవారు. గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అనంతరం ఈ విచారణ చేపట్టడం లేదు. పైగా స్లాటు నమోదై తహసీల్దారు-సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు వద్దకు వస్తే అడ్డుచెప్పకుండానే రిజిస్ట్రేషన్‌ చేయాలని చట్టం సూచిస్తోంది. దీంతో తహసీల్దార్లు వారసత్వ బదిలీని పూర్తి చేసేస్తున్నారు.


ఏడు రోజుల వ్యవధి ఎందుకో?

రణి పోర్టల్‌లో నిర్వహిస్తున్న వారసత్వ బదిలీ ప్రక్రియపై రెవెన్యూ అధికారుల్లోనూ స్పష్టత కొరవడింది. భూయజమానులు మీసేవలో లాగిన్‌ అయ్యాక.. 7 రోజులకు స్లాట్‌ నమోదు జరుగుతోంది. తరువాత తహసీల్దారు-సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. మిగిలిన సేవలు ఒకట్రెండు రోజుల్లోనే పూర్తవుతున్నాయి. వారసత్వ బదిలీకి సంబంధించి భూయజమాని లాగిన్‌ అయినదీ, స్లాట్‌ నమోదు చేసుకున్నదీ తహసీల్దారు వద్దకు చేరేదాకా వారికి ఏ సమాచారం ఉండటంలేదు. ధరణి పోర్టల్‌ అమలు తర్వాత కూడా మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో.. దీనిలో స్పష్టత కొరవడిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ధరణి సేవల అమలు మినహా తహసీల్దార్లకు అధికారాలేవీ లేవు. గతేడాది పాత ఆర్‌ఓఆర్‌ చట్టం రద్దు చేశాక క్షేత్రస్థాయి విచారణ అధికారాలన్నీ రద్దయ్యాయి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని