తెలంగాణలో జర్మనీ పరిశ్రమల క్లస్టర్‌

తెలంగాణలో జర్మనీ పెట్టుబడిదారుల కోసం క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని, సౌకర్యాల కేంద్రం ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. జర్మనీ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే

Published : 07 Dec 2021 04:47 IST

పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేస్తాం
జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో కేటీఆర్‌
జహీరాబాద్‌లో రూ.1500 కోట్లతో వాహన విడిభాగాల పరిశ్రమకు ఒప్పందం

హైదరాబాద్‌లో నిర్వహించిన జర్మన్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్‌, జర్మన్‌ రాయబారి వాల్టర్‌ సమక్షంలో

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌, లైట్‌ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలానంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో జర్మనీ పెట్టుబడిదారుల కోసం క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని, సౌకర్యాల కేంద్రం ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. జర్మనీ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలను అందిస్తామని తెలిపారు. ఇండోజర్మన్‌ పరిశ్రమలు, వాణిజ్యమండళ్ల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం జరిగిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘వాణిజ్య విధానాన్ని భారత్‌ నిర్ణయిస్తుంది. కార్యాచరణ రాష్ట్రాల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో  తెలంగాణ అన్ని రంగాల్లో రాణిస్తోంది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా అందుబాటులోకి తెచ్చాం. రెండు లక్షల ఎకరాల భూమి, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 15 రోజుల్లో 17,500 కంపెనీలకు అనుమతులు ఇచ్చాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్‌ జె.లిండ్నర్‌ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. సమావేశంలో జర్మన్‌ కాన్సుల్‌ జనరల్‌ కరీన్‌ స్టోల్‌, ఇండోజర్మన్‌ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య  డైరెక్టర్‌ జనరల్‌ స్టీఫన్‌ హలూసా, సైయెంట్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లిండ్నర్‌, కరీన్‌స్టోల్‌, పారిశ్రామికవేత్తలు మంత్రి కేటీఆర్‌ను జర్మనీ సందర్శించాలని ఆహ్వానించారు. జనవరి 16 నుంచి 19 వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అనంతరం... 20 తర్వాత జర్మనీలో తమ ప్రభుత్వం బృందంతో కలిసి పర్యటిస్తామని కేటీఆర్‌ తెలిపారు.  

9వేల మందికి ప్రత్యక్ష ఉపాధి  
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమోటివ్‌ సంస్థ ‘లైట్‌ ఆటో’ జహీరాబాద్‌లో 100 ఎకరాల్లో రూ.1500 కోట్లతో వాహన విడిభాగాలు, ముడిపదార్థాల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్‌, జర్మనీ రాయబారి లిండ్నర్‌ల సమక్షంలో  పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, లైట్‌ ఆటో ఎండీ బాలానంద్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. సంస్థ ద్వారా తొమ్మిది వేల మందికి ప్రత్యక్షంగా, మరో 18 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా బాలానంద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని