రేపటి నుంచే ఉద్యోగులకు ఐచ్ఛికాలు

కొత్త జోనల్‌ విధానం మేరకు తెలంగాణలోని ఉద్యోగులను వారి సొంత జిల్లాలు, జోన్లకు బదలాయింపు కోసం గురువారం ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రభుత్వం

Updated : 08 Dec 2021 11:29 IST

నేడు సీనియారిటీ జాబితాల ప్రదర్శన
11 నుంచి 15 వరకు జిల్లా కమిటీల సమావేశాలు
15 నుంచి కేటాయింపుల ఉత్తర్వులు
బదలాయింపు షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త జోనల్‌ విధానం మేరకు తెలంగాణలోని ఉద్యోగులను వారి సొంత జిల్లాలు, జోన్లకు బదలాయింపు కోసం గురువారం ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం బుధవారం వరకు సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి, తమ కార్యాలయాలు, కలెక్టరేట్లలో ఉన్నతాధికారులు ప్రదర్శించాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్న కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహాయించి... వరంగల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఉద్యోగుల నుంచి బదిలీల కోసం ఐచ్ఛికాలను స్వీకరిస్తారు. పదో తేదీన ఈ దరఖాస్తుల ఆధారంగా సీనియారిటీ జాబితాను పరిశీలిస్తారు. 11 నుంచి 15 తేదీ వరకు బదలాయింపులపై జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు జరుగుతాయి. 15వ తేదీన సొంత జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ అవుతాయి.  ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత మిగతా అయిదు జిల్లాల్లో ఉద్యోగుల బదలాయింపులకు ఐచ్ఛికాలు ఇచ్చి ప్రక్రియను కొనసాగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా స్థాయి బదలాయింపుల అనంతరం జోనల్‌, బహుళ జోనల్‌ ఉద్యోగుల బదలాయింపులపై విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై ప్రతి జిల్లాకు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బుధవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. జోనల్‌, బహుళ జోనల్‌ బదిలీలపై పర్యవేక్షణకూ అధికారులను నియమిస్తారని తెలుస్తోంది.

* ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం బీఆర్‌కే భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుధవారం సాయంత్రంలోగా ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని శాఖలు,  కలెక్టర్లు తమ తమ పరిధిలోని ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను సమర్పించాలని ఆదేశించారు.  బదలాయింపులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలన్నారు.

* టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌లు సీఎస్‌ను కలిశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ ఐచ్ఛికాలు ఇస్తేనే బదిలీల్లో పరిపూర్ణత...
ప్రభుత్వం చేపడుతున్న జోనల్‌ బదిలీల్లో పలు కీలక అంశాలు, ఐచ్ఛికాలను చేర్చితేనే ఉద్యోగులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) సూచించింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు మంగళవారం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్‌లతో కూడిన ప్రతినిధి బృందం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జోనల్‌ బదిలీలపై చేసిన సూచనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎస్‌ హామీ ఇచ్చారని ట్రెసా ప్రతినిధులు తెలిపారు. వారు సూచించిన కీలకాంశాలు  

* వివిధ కేడర్ల పోస్టులకు జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ బదిలీలకు ఉద్యోగులకు ఐచ్ఛికాలు ఇవ్వాలి.

* ప్రొఫార్మాలో స్పౌస్‌, పీహెచ్‌సీ (దివ్యాంగుల కోటా) కేటగిరి, మెడికల్‌ గ్రౌండ్స్‌ ఐచ్ఛికాలు తప్పనిసరిగా పొందుపర్చాలి.

* కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు 2016లో ఆర్డర్‌ టు సర్వ్‌ కింద బదిలీలు చేసిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాతోపాటు ఉద్యోగంలో చేరాక మొదటి నియామక జిల్లా (ఎస్టాబ్లిష్‌మెంట్‌ జిల్లా)ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.  

* రెవెన్యూశాఖను బలోపేతం చేసేందుకు అవసరమైన గరిష్ఠ కేడర్‌ స్ట్రెంత్‌ను నిర్ధారించాలి.

* డిప్యూటీ కలెక్టర్‌, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులు కల్పించాలి.

* డీపీసీ ఆమోదం పొంది తహసీల్దార్ల పోస్టింగ్‌ కోసం ఎదురుచూపుల్లో ఉన్న డీటీలకు పోస్టింగ్‌ ఇవ్వాలి.  

* ప్రభుత్వ అవసరార్థం దూర ప్రాంతాల్లో నియమించిన ప్రొబెషనరీ డీటీలకు జిల్లాలకు బదిలీ అవకాశం కల్పించాలి.

* వీఆర్వోలకు బదిలీ ఐచ్ఛికం ఇవ్వాలి.


జోనల్‌ విధానంతో సంపూర్ణన్యాయం: శ్రీనివాస్‌గౌడ్‌

టీజీవోల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులకు కొత్త జోనల్‌ విధానం ద్వారా సంపూర్ణన్యాయం జరుగుతుందని, సొంత జిల్లాల్లో, జోన్లలో శాశ్వతంగా పనిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప అవకాశం కల్పించారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంగళవారం తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల (టీజీవో) సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పక్కాగా, సకాలంలో పూర్తయ్యేందుకు టీజీవో, టీఎన్జీవో తదితర సంఘాలు సహకరించాలన్నారు. సర్దుబాటైన వెంటనే ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని తెలిపారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. సంఘం బాధ్యులందరూ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని