షెడ్యూలు-3లోకి నెట్టెంపాడు, జూరాల

నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులను గెజిట్‌ నోటిఫికేషన్‌లోని షెడ్యూలు-2 నుంచి తొలగించి షెడ్యూలు-3లో చేర్చాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా తెలంగాణ

Published : 08 Dec 2021 04:45 IST

చేర్చాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

ఈనాడు హైదరాబాద్‌: నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులను గెజిట్‌ నోటిఫికేషన్‌లోని షెడ్యూలు-2 నుంచి తొలగించి షెడ్యూలు-3లో చేర్చాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా తెలంగాణ అవసరాలను తీర్చేవే కాబట్టి బోర్డు పరిధిలో ఉండే షెడ్యూలు-2 ప్రాజెక్టుల జాబితాలో అవసరం లేదని పేర్కొంది. తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సవరించి న్యాయం చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ మంగళవారం లేఖ రాశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని గెజిట్‌ నోటిఫికేషన్‌లో రెండు విభాగాలుగా చూపించారని, దీనిని మార్చి ఒకటిగానే చూపించాలని కోరారు.  ‘‘నాటి హైదరాబాద్‌ ప్రభుత్వం 174.3 టీఎంసీలతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు గ్రావిటీ ద్వారా భీమా, తుంగభద్ర ఎడమ కాలువ, అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టులు నిర్మించాలని ప్రతిపాదించింది. 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని అడగకపోవడంతో తెలంగాణ ఆయకట్టు వరకు చేరకుండానే ఈ ప్రాజెక్టులు ఆగిపోయాయి. దీంతో తర్వాత కాలంలో ఎత్తిపోతల పథకాలు తప్పనిసరయ్యాయి. ఆ ఆయకట్టుకు నీరివ్వడానికి జూరాల స్టేజి-1 గ్రావిటీతో 23 టీఎంసీలు, స్టేజి-2 లిప్టుతో 28.8 టీఎంసీలను 1970లో నాటి తెలంగాణ ఉద్యమ తీవ్రత దృష్ట్యా ప్రతిపాదించినా, తర్వాత వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వొద్దని, ఆంధ్రా ప్రాజెక్టులకే ఇవ్వాలని 1973లో ట్రైబ్యునల్‌కు నివేదించారు. జూరాల డ్యాంను మొదట ప్రతిపాదించిన ప్రదేశంలో కాకుండా ఎగువన సామర్థ్యాన్ని తగ్గించి 11 టీఎంసీలతోనే నిర్మించారు. భీమా లిఫ్టుతో జూరాల ఎడమ కాలువ కింద కొంత ఆయకట్టుకు నికర జలాలను కేటాయించినా, ఈ ఆయకట్టు కోసం మిగులు జలాల ఆధారంగా చేపట్టిన నెట్టెంపాడు ఎత్తిపోతలను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తిచేసింది. తెలంగాణ ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ను కూడా కోరింది’’అని లేఖలో పేర్కొన్నారు.


డిండి ఎత్తిపోతల పనులు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకే
ఎన్‌జీటీలో తెలంగాణ కౌంటర్‌  

డిండి ఎత్తిపోతల పథకంలో ప్రస్తుతం చేపట్టిన పనులు తాగు, పారిశ్రామిక అవసరాల కోసమేనని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) దృష్టికి తెచ్చింది. కరవుపీడిత, ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడం ప్రధానమని పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన వీరాంజనేయ రిజర్వాయర్‌ వెనకభాగం నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున 30 టీఎంసీల వరద నీటిని మళ్లించేలా ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలిపింది.  భవిష్యత్తులో సాగునీటి అవసరాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేయాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఎన్జీటీ ఎదుట కౌంటర్‌ దాఖలు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా తెలంగాణ డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందంటూ ఏపీ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని, దీనిని నిలిపివేయాలని కోరింది. దీనిపై ఇచ్చిన నోటీసుకు సమాధానంగా తెలంగాణ కౌంటర్‌ దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని