Updated : 08/12/2021 05:15 IST

ఒమిక్రాన్‌ రూపంలో మూడోదశ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం

సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌కి సంబంధించి ఎన్ని దశలు వచ్చినా, ఎప్పుడొచ్చినా ఉద్ధృతిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. రెండోదశలో డెల్టా వేరియంట్‌ విజృంభించినట్లే.. ఒమిక్రాన్‌ రూపేణా మూడోదశ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమంది. డెల్టా కంటే ఆరింతలు వేగంగా వ్యాపించే ఒమిక్రాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉపద్రవాలను తిప్పికొట్టేందుకు ముందస్తుగా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొంది. అర్హులందరికీ టీకాల పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీచేసింది.  
* అన్ని జిల్లా కేంద్రాల్లో టెలీ వైద్య వ్యవస్థను విస్తరించాలి.

* ఆన్‌లైన్‌ విధానంలో శిక్షణ అందించాలి. స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, పీసీల్లో అవసరమైన సమాచారాన్ని పొందేలా ఏర్పాట్లు చేయాలి. శిక్షణ మాడ్యూల్స్‌ను ప్రాంతీయ భాషలోకి అనువదించాలి.

* జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో కొత్తగా క్రిటికల్‌ కేర్‌ సంబంధిత పడకలను ఏర్పాటుచేయాలి.

* వ్యాధి నియంత్రణకు ప్రాంతీయ అంటువ్యాధుల కేంద్రాలను పటిష్ఠపరచాలి.

* అన్ని మెట్రో నగరాల్లో వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు ఏర్పాటుచేయాలి.

* ఉన్న వైరల్‌ డయాగ్నోస్టిక్‌ అండ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ల(వీఆర్‌డీఎల్‌)ను బలోపేతం చేయాలి.

* కొత్తగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వన్‌ హెల్త్‌లను ఏర్పాటుచేయాలి.

* గ్రామాలు, నగరాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను మరింతగా బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలి.

* అంతర్జాతీయ ప్రయాణ కేంద్రాల వద్ద ప్రజారోగ్య కేంద్రాలను నెలకొల్పాలి.

* కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల, ఆసుపత్రుల పడకల ధరలకు పరిమితులు విధించాలి.

* ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది సహా ఇతర మానవ వనరులను సంసిద్ధం చేసుకోవాలి, ఇతర వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ కార్మికులు తదితరులకు అవసరమైన శిక్షణ ఇప్పించాలి.

* కొవిడ్‌ నిర్వహణ విధుల్లో మెడికల్‌ ఇంటర్నీల సేవలను ఉపయోగించుకోవాలి.

* ఎంబీబీఎస్‌ చివరి సంవత్సర విద్యార్థులను టెలి-కన్సల్టేషన్‌, తేలికపాటి కొవిడ్‌ కేసుల పర్యవేక్షణ వంటి సేవలకు వినియోగించుకోవాలి.

* మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ తుది సంవత్సర విద్యార్థుల సేవలను కొవిడ్‌ విధుల్లో ఉపయోగించుకోవాలి. కొత్త నియామకాలు జరిగే వరకు సీనియర్‌ రెసిడెంట్ల సేవలను వినియోగించుకోవాలి.

* బీఎస్సీ, జీఎన్‌ఎం అర్హత పొందిన నర్సులను పూర్తి సమయం కొవిడ్‌ నర్సింగ్‌ విధుల్లో ఉపయోగించుకోవాలి.

* జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఒప్పంద ప్రాతిపదికన అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించుకోవాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే నిపుణులైన వైద్యులకు భత్యం కోసం అవసరమైన ఆర్థిక సాయమందించాలి.

* పిల్లల్లో కరోనాకు సంబంధించిన ‘మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌’ను ఎదుర్కోవడానికి  మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలి.

* ఆక్సిజన్‌ ప్లాంట్ల స్థాపనకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆర్థికసాయం అందుతుంది.

* ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగ తనిఖీలను నిర్వహించాలి.


కొత్తగా 203 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 203 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 6,77,341కి పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయడంతో మొత్తం మృతుల సంఖ్య 4,001కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,852 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 87 పాజిటివ్‌లు నమోదయ్యాయి. మంగళవారం 105 మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకోగా అందరికీ కొవిడ్‌ నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.

* మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం ఎంపీడీవో చలపతిరావుకు మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల ప్రత్యేక శిక్షణ కోసం రాజస్థాన్‌కు వెళ్లి వచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని