ఎన్నికల వేళ వేతనాల పెంపా?

ఎన్నికల వేళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టినట్లు తెలిసింది. మున్సిపల్‌ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం

Published : 08 Dec 2021 04:45 IST

ఇది నియమావళి అతిక్రమణే
మున్సిపల్‌ అధికారులను తప్పుబట్టిన ఈసీ

ఈనాడు, హైదరాబాద్‌ : ఎన్నికల వేళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టినట్లు తెలిసింది. మున్సిపల్‌ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర శాసనమండలిలో స్థానిక సంస్థల కోటాలో 12 మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గతనెల 9న షెడ్యూల్‌ను ప్రకటించింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచుతూ అదే నెల 18న రాష్ట్ర మున్సిపల్‌ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా మండలి స్థానాలకు ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయటంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దాంతో ఆ ఉత్తర్వులు వాస్తవమా? కాదా? తెలపాలని  రాష్ట్ర ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. అయితే జారీ అయిన మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం పెంపుదల ఉత్తర్వులను రద్దు చేసింది. ఉత్తర్వుల జారీ, రద్దు వ్యవహారాలపై ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఆ నివేదికను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయటంతోపాటు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు పంపిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్నికల విధుల నిర్వహణలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డిలకు లిఖిత పూర్వకంగా హెచ్చరికలు జారీ చేయటంతోపాటు.. సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. గౌరవ వేతనం పెంపుదల ఉత్తర్వులు జారీ చేయటం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించటమేనని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు