నకిలీ వీసాలతో గల్ఫ్‌కు

గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాల నుంచి పేద, మధ్యతరగతి మహిళలను అక్రమంగా దేశం దాటించేందుకు దళారులు భారీ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్నట్లు బయటపడింది. వీరు అమాయక మహిళలను కువైట్‌లో ఉద్యోగాలంటూ నమ్మిస్తున్నారు.

Published : 09 Dec 2021 05:09 IST

మూడు నెలల్లో 200 మంది మహిళల తరలింపు
విమానాశ్రయంలో ఇంటిదొంగల సహకారం
పోలీసుల అదుపులో హైదరాబాద్‌ ఏజెంట్‌

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌: గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాల నుంచి పేద, మధ్యతరగతి మహిళలను అక్రమంగా దేశం దాటించేందుకు దళారులు భారీ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్నట్లు బయటపడింది. వీరు అమాయక మహిళలను కువైట్‌లో ఉద్యోగాలంటూ నమ్మిస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లోని దళారులతో మాట్లాడుకుని ఇక్కడి నుంచి పర్యాటక, సందర్శకుల వీసాలతో వారిని పంపుతున్నారు. ముంబయి కేంద్రంగా ఓ దళారి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ నగరాల్లో సబ్‌ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా మూడు నెలల్లో 200 మంది మహిళలను అక్రమంగా కువైట్‌కు పంపించాడని సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ముఠాకు శంషాబాద్‌ విమానాశ్రయంలో కొందరు సహకరిస్తున్నారని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కలర్‌ జెరాక్స్‌లతో బురిడీ
ఘరానా ఏజెంట్లు నకిలీ పేర్లతో మహిళలకు వీసాలు తీసుకుంటున్నారు. పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లలో పేర్లు మార్చి కలర్‌ జెరాక్స్‌లు తీసి పంపుతున్నారు. ఈ మూడునెలల్లో తూర్పుగోదావరి, కృష్ణా, నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన పలువురు మహిళలను ఇలా తరలించారని పోలీసులు గుర్తించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ వీసాలు, పాస్‌పోర్టులను పరిశీలిస్తున్న ఓ విభాగంలో పనిచేస్తున్న కొందరు ముంబయి, హైదరాబాద్‌ ఏజెంట్ల నుంచి కమీషన్‌ తీసుకుని సహకరిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ ముఠా ప్రధాన ఏజెంట్‌ ముంబయిలో ఉన్నాడని తెలుసుకున్నారు. ప్రస్తుతం అతడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు హైదరాబాద్‌ ఏజెంట్ల ద్వారా కువైట్‌కు వెళ్లిన మహిళల వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు