రైతుకు మాతృభాషలో సమాచారం అందాలి

రైతులకు మాతృభాషలో వ్యవసాయ సమాచారాన్ని అందిస్తే వారికి ఉపయుక్తంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ప్రయత్నించాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లో జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ

Updated : 09 Dec 2021 13:17 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ఆకాంక్ష
వీసీ ప్రవీణ్‌కు స్వామినాథన్‌ అవార్డు ప్రదానం

  

స్వామినాథన్‌ స్మారక పురస్కారాన్ని ప్రవీణ్‌రావుకు ప్రదానం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిత్రంలో రికారియా అధ్యక్షులు ఎంవీఆర్‌ ప్రసాద్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి, నూజివీడు సీడ్స్‌ ఎండీ, సీఈవో ప్రభాకర్‌రావు, రికారియా ప్రధాన కార్యదర్శి మురళీధరుడు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: రైతులకు మాతృభాషలో వ్యవసాయ సమాచారాన్ని అందిస్తే వారికి ఉపయుక్తంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ప్రయత్నించాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లో జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావుకు ఎంఎస్‌ స్వామినాథన్‌ స్మారక అవార్డును ప్రదానం చేశారు. నూజివీడు సీడ్స్‌, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ విశ్రాంత ఉద్యోగుల సమాఖ్య (రికారియా) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, నూజివీడు సీడ్స్‌ ఎండీ, సీఈవో ప్రభాకర్‌రావు, రికారియా అధ్యక్షులు ఎంవీఆర్‌ ప్రసాద్‌లతో కలిసి బుధవారం ఉపరాష్ట్రపతి ఈ అవార్డును బహూకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలపైనా.. పాడి, ఆక్వా, హార్టికల్చర్‌ తదితర రంగాలపైనా దృష్టి సారించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల శ్రేయస్సుకు ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. అన్నదాతలకు కావాల్సింది ఉచిత కరెంటు కాదని, స్థిరమైన, నాణ్యమైన 12 గంటల విద్యుత్‌ను అందజేయాలని అభిలషించారు. సాగుకు సంబంధించిన సమస్త సమాచారం రైతుకు మాతృభాషలో అందితే ప్రయోజనకరమని వెంకయ్యనాయుడు వివరించారు. కొందరు పార్లమెంటుకు హాజరుకావడం లేదని, పైగా తమకు సమయం కేటాయించడం లేదని చెబుతున్నారంటూ ఉపరాష్ట్రపతి చమత్కరించారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు శ్రమను గౌరవించని ఆధునిక ఆలోచన విధానం సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. స్వామినాథన్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. తన 38 ఏళ్ల సర్వీసులో చాలామంది తనకు సహకరించారన్నారు. రికారియాకు చెందిన సావనీర్‌ను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని