తెలంగాణకు బియ్యం సేకరణకు రూ.1,752 కోట్లు చెల్లించాలి

కేంద్ర వాటా కింద (సెంట్రల్‌ పూల్‌) సేకరించిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రూ.1,751.79 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. ఈ బకాయిల గురించి లోక్‌సభలో

Published : 09 Dec 2021 05:20 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర వాటా కింద (సెంట్రల్‌ పూల్‌) సేకరించిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రూ.1,751.79 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. ఈ బకాయిల గురించి లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. తెలంగాణ బకాయిల్లో ఎఫ్‌సీఐ రూ.1,464.64 కోట్లు, డీసీపీ కింద రాష్ట్రం క్లెయిమ్‌చేసిన రూ.287.15 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు వివరించారు. 2021-22 ఖరీఫ్‌ మార్కెట్‌ సీజన్‌లో తెలంగాణ అవసరాల కోసం బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌) 2.20 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఆ రాష్ట్రం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన 15 లక్షల మెట్రిక్‌ టన్నులు కలిపి మొత్తం 17.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సరఫరా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు.

రైల్వే పాఠశాలల హేతుబద్ధీకరణ!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి చాలాచోట్ల రైల్వే పాఠశాలలను మూసేయాలని ప్రతిపాదించినట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వైకాపా ఎంపీ శ్రీధర్‌ కోటగిరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.  

రాష్ట్రంలో 11.23%, ఏపీలో 18.94% ఏకోపాధ్యాయ పాఠశాలలు
తెలంగాణలో 11.23%, ఆంధ్రప్రదేశ్‌లో 18.94% ఏకోపాధ్యాయ పాఠశాలలున్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణ దేవి బుధవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జాతీయ స్థాయిలో సగటున 6.80% మేర ఇలాంటివి ఉన్నట్లు వెల్లడించారు. ¸సమగ్ర శిక్ష కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.394.73 కోట్లు, ఏపీకి రూ.492.40 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదించినట్టు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.

కల్వకుర్తి-హైదరాబాద్‌ రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వినతి
కల్వకుర్తి-హైదరాబాద్‌ రహదారిని నాలుగు వరుసల మార్గంగా విస్తరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అందినట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెరాస ఎంపీ కె.ఆర్‌.సురేష్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ మార్గం ఆధునికీకరణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని, భారత్‌మాల లాంటి ప్రాజెక్టుల్లో చేర్చే దిశగానూ యోచిస్తోందన్నారు.

తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోనివి జాతీయ రహదారులు కావు
తెలంగాణ నుంచి కర్ణాటకలోని బీజాపుర్‌, రామసముద్ర, యాద్గిర్‌ నగరాల సరిహద్దుల్లో ఉన్న మార్గాలు జాతీయ రహదారులు కావని కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. హైదరాబాద్‌ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న 118 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారి 163గా 2016 నవంబరులో ప్రకటించినట్లు చెప్పారు. అందులో హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు నుంచి మన్నెగడ్డ వరకు 46 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు వరసలుగా నిర్మించే బాధ్యతలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగించామన్నారు. మన్నెగడ్డ నుంచి రావులపల్లె (తెలంగాణ-కర్ణాటక సరిహద్దు) వరకు ఇదివరకే రెండు వరసల్లో నిర్మించినట్లు చెప్పారు. తెలంగాణ సరిహద్దు నుంచి బిజాపుర్‌, మెదక్‌ సరిహద్దు నుంచి రామసముద్ర, యాద్గిర్‌ సిటీ నుంచి సిందగీ వయా సహాపుర్‌ వరకు ఉన్న మార్గాలు జాతీయ రహదారులు కావని స్పష్టంచేశారు.

రాష్ట్రంలో 14, ఏపీలో 33 జ్యుడిషియల్‌ కస్టడీ మరణాలు
ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నవంబరు 15 వరకు తెలంగాణలో 14 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 33 మంది జ్యుడిషియల్‌ కస్టడీలో చనిపోయినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌ నుంచి అందిన సమాచారం మేరకు ఈ కాలంలో దేశవ్యాప్తంగా పోలీస్‌ కస్టడీలో 114 మంది, జ్యుడిషియల్‌ కస్టడీలో 1,451 మంది చనిపోయినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో పోలీసు కస్టడీలో ఎవరూ చనిపోలేదన్నారు.

తెలంగాణ నుంచి 48, ఏపీ నుంచి 126 కిసాన్‌ రైళ్లు
కిసాన్‌ రైళ్లు ప్రారంభమైనప్పట్నుంచి ఇప్పటివరకు తెలంగాణ నుంచి 48, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 126 సర్వీసులు నడిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని